తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ముఖ్యమంత్రి సహాయ నిధి ఆపదలో ఉన్నవారికి వరం.అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు అందేలా నిరంతరం కృషి.ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు.రూ.2.17కోట్ల విలువచేసే సంక్షేమ చెక్కులను లబ్దిదారులకు అందించిన ఎమ్మెల్యే . పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యమని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. బుధవారం కొత్తగూడెం క్లబ్బులో కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాలతో పాటు సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ కింద 144 మంది లబ్ధిదారులకు రూ. 1,60,00,704 విలువగల చెక్కులను, అలాగే నియోజకవర్గ పరిధిలోని మరో 143 మంది లబ్ధిదారులకు రూ. 57,34,500 విలువచేసే సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆడబిడ్డల పెళ్లిళ్లకు తల్లిదండ్రులు అప్పులపాలు కాకూడదనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాలు పేద కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తున్నాయని కొనియాడారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క ఆడబిడ్డ పెళ్లి ఆగిపోకూడదనేదే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. అదేవిధంగా, అనారోగ్యం మరియు ఆపద కాలంలో వైద్య ఖర్చుల నిమిత్తం ఇబ్బంది పడుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరంగా మారిందని, ఎంతోమంది ప్రాణాలను నిలబెడుతోందని హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. లబ్ధిదారులందరూ ఈ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేయర్ మూడ్ గణేష్, డిప్యూటీ మేయర్ లలిత కుమారి, గ్రంధాలయ చైర్మన్ వీరబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ వీరబాబు, సొసైటీ చర్మం హనుమంతరావు, కార్పొరేషన్ కమిషనర్ సుజాత, తహసిల్దార్లు పుల్లయ్య, కృష్ణ ప్రసాద్, ప్రసాద్, కార్పొరేటర్లు, నాయకులు వాసిరెడ్డి మురళీ, సర్పంచులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ