తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి ప్రతిపాదిత స్థలాల పరిశీలన. రెండు రోజులుగా ప్రతిపాదిత ప్రాంతాల్లో ఏఏఐ సాంకేతిక బృందం క్షేత్రస్థాయి పరిశీలన. తిమ్మంపేటలో పరిశీలనను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ అంకిత్.పరిశీలన వివరాలను కలెక్టర్‌కు వివరించిన బృంద సభ్యులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కు చెందిన సాంకేతిక నిపుణుల బృందం రెండు రోజులుగా జిల్లాలోని ప్రతిపాదిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, విమానాశ్రయ ఏర్పాటుకు అనుకూలతపై వివిధ సాంకేతిక అంశాలను అధ్యయనం చేస్తోంది. మంగళవారం ములకలపల్లి మండలం తిమ్మంపేటలో జరుగుతున్న సాంకేతిక పరిశీలనను ఏ ఏ ఐ బృంద సభ్యులతో కలసి జిల్లా కలెక్టర్ అంకిత్ పర్యవేక్షించారు.జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి సుజాతానగర్ మండలంలోని సీతంపేట, సుజాతానగర్, దుమ్ముగూడెం మండలంలోని దుమ్ముగూడెం, ములకలపల్లి మండలంలోని చాపరాలపల్లి, దమ్మపేట మండలంలోని పాల్వంచ/దమ్మపేట, చుంచుపల్లి మండలంలోని పెనగడప ప్రాంతాలను ప్రతిపాదిత స్థలాలుగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో విమానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన భౌగోళిక, భౌతిక, సాంకేతిక ప్రమాణాలను పరిశీలించేందుకు ఏఏఐ సాంకేతిక బృందం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేపట్టింది.ఏఏఐ సభ్యులు భరత్ రెడ్డి, ఎం.డి. ఏవియేషన్ నేతృత్వంలోని సాంకేతిక బృందం ప్రతిపాదిత ప్రాంతాల్లో భూమి స్వభావం, ఎత్తుపల్లాలు, కొండలు, కొండచరియలు, అటవీ ప్రాంతాలు, నీటి ప్రవాహ మార్గాలు, రహదారులు, రైల్వే మార్గాలు, విద్యుత్ లైన్లు తదితర అంశాలను పరిశీలించింది. విమానాశ్రయానికి అత్యంత కీలకమైన రన్‌వే ఏర్పాటుకు అవసరమైన ప్రాంతం, విమానాల రాకపోకలకు సంబంధించిన అప్రోచ్ ప్రాంతం, పరిసరాల్లో ఉన్న అడ్డంకులు తదితర అంశాలపై కూడా సాంకేతికంగా అంచనా వేసింది.గతంలో ప్రతిపాదించిన ప్రాంతాలకు సంబంధించి మ్యాప్‌ల ఆధారంగా సుమారు 500 ఎకరాల విస్తీర్ణాన్ని పరిశీలించినప్పటికీ, విమానాశ్రయానికి అవసరమైన రన్‌వే, అప్రోచ్, ఇతర అనుబంధ సౌకర్యాల దృష్ట్యా అదనపు ప్రాంతాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని సాంకేతిక బృందం తెలిపింది . ముఖ్యంగా అప్రోచ్ ప్రాంతానికి సుమారు 1.5 కిలోమీటర్ల వరకు అదనపు స్థలం అవసరమయ్యే అవకాశాలను కూడా బృందం పరిశీలిస్తోంది అని తెలిపారు.కొన్ని ప్రతిపాదిత ప్రాంతాల్లో రైల్వే మార్గం సమీపంలో ఉండటాన్ని కూడా సాంకేతిక బృందం పరిశీలించింది. సత్తుపల్లి గూడ్స్ రైల్వే లైన్ ప్రతిపాదిత ప్రాంతానికి సుమారు 100 నుంచి 120 మీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాల్లో రన్‌వే దిశ, విమానాల అప్రోచ్‌కు దాని ప్రభావం తదితర అంశాలను అధ్యయనం చేస్తున్నారు. రైల్వే విద్యుదీకరణ వ్యవస్థ కారణంగా ఏర్పడే విద్యుదయస్కాంత ప్రభావాలు విమానాశ్రయ కమ్యూనికేషన్, నావిగేషన్ పరికరాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, అవసరమైన సాంకేతిక రక్షణ చర్యలు, రైల్వే శాఖ నుంచి అవసరమైన అనుమతులు తదితర అంశాలను కూడా పరిశీలించాల్సి ఉంటుందని బృందం వివరించింది.దుమ్ముగూడెం ప్రాంతంలో కూడా సాంకేతిక బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించింది. ప్రధాన రహదారి నుంచి ప్రతిపాదిత ప్రాంతానికి వెళ్లే మార్గం ప్రస్తుతం ఇరుకుగా, కొన్ని చోట్ల మట్టి రహదారిగా ఉండటం, పరిసరాల్లో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండటం వంటి అంశాలను గుర్తించింది. అదే సమయంలో భూమి ప్రొఫైల్ అనుకూలంగా ఉండటం, విమానాశ్రయానికి పెద్దగా అడ్డంకులు కనిపించకపోవడం వంటి సానుకూల అంశాలను కూడా పరిశీలించింది. భవిష్యత్‌లో రహదారి, వంతెనల అభివృద్ధితో కనెక్టివిటీ మెరుగుపడే అవకాశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు .ప్రతిపాదిత ప్రాంతాల్లో ఉన్న చిన్న కొండలు, మట్టి మడులు, ఎత్తైన ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు విమానాశ్రయ నిర్మాణానికి ఏ మేరకు ప్రభావం చూపుతాయనే అంశాన్ని కూడా బృందం పరిశీలిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో సుమారు 10 నుంచి 15 మీటర్ల ఎత్తు కలిగిన చిన్న కొండలు ఉన్నట్లు గుర్తించి, వాటిని తొలగించడం లేదా భూమిని సమతలీకరించడం సాంకేతికంగా సాధ్యమా అనే అంశాన్ని పరిశీలించనుంది. అదేవిధంగా ఉన్న మట్టి మడులు/ఓవర్‌బర్డెన్ ప్రాంతాల తొలగింపు సాధ్యాసాధ్యాలను కూడా అధ్యయనం చేయనుంది.విమానాశ్రయానికి ప్రతిపాదిత ప్రాంతాల్లో నీటి ప్రవాహ మార్గాలు, వాగులు, కాలువలు ఉండటం కూడా కీలకమైన అంశంగా సాంకేతిక బృందం పేర్కొంది. రన్‌వే కింద నీటి ప్రవాహ మార్గాలు ఉండటం వల్ల ఎదురయ్యే సాంకేతిక సమస్యలు, డ్రైనేజీ ఏర్పాట్లు, భూమి ఆకృతి ఆధారంగా రన్‌వే దిశను మార్చే అవకాశం ఉందా అనే అంశాలను కాంటూర్ మ్యాప్‌లు, టోపోగ్రాఫికల్ డేటా ఆధారంగా పరిశీలించనున్నారు.భూమి స్వభావంలో బ్లాక్ కాటన్ సాయిల్ వంటి మట్టి రకాలు ఉన్న ప్రాంతాల్లో నిర్మాణానికి అవసరమైన భూసాంకేతిక అంశాలను కూడా పరిశీలించాల్సి ఉంటుందని సాంకేతిక బృందం తెలిపింది. అటవీ ప్రాంతంగా నమోదైన భూములు, ఓపెన్ ఫారెస్ట్ ప్రాంతాలు, పర్యావరణ పరమైన అనుమతులు, చెట్ల తొలగింపు తదితర అంశాలపై సంబంధిత శాఖల నుంచి అవసరమైన వివరాలు, అనుమతుల పరిస్థితిని కూడా పరిశీలించనున్నారు.విమానాశ్రయ స్థల ఎంపికలో కేవలం భూమి విస్తీర్ణం మాత్రమే కాకుండా భూమి ఎత్తుపల్లాలు, రన్‌వే దిశ, విమానాల అప్రోచ్ మార్గం, పరిసర కొండలు, అటవీ ప్రాంతాలు, నీటి ప్రవాహ మార్గాలు, రైల్వే–రహదారి మార్గాలు, విద్యుత్ లైన్లు, గాలి వేగం–దిశ, వర్షపాతం, భూసాంకేతిక పరిస్థితులు వంటి అనేక అంశాలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఏఏఐ సాంకేతిక బృందం స్పష్టం చేసింది.ప్రతిపాదిత స్థలాలపై క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాలను కాంటూర్ మ్యాప్‌లు, టోపోగ్రాఫికల్ మ్యాప్‌లు, గత 10 నుంచి 40 సంవత్సరాల వర్షపాతం వివరాలు, గాలి వేగం–దిశకు సంబంధించిన డేటా తదితర సమాచారంతో అనుసంధానం చేసి సాఫ్ట్‌వేర్ ఆధారిత విశ్లేషణ, సిమ్యులేషన్ నిర్వహించనున్నట్లు సాంకేతిక బృందం తెలిపింది. విమానాశ్రయ కార్యకలాపాలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ , కమ్యూనికేషన్ వ్యవస్థలు, సివిల్ ఇంజినీరింగ్ అంశాలను వేర్వేరుగా పరిశీలించి సమగ్ర సాంకేతిక సాధ్యాసాధ్యాలను అంచనా వేయనున్నారు.ఈ సందర్భంగా ఏఏఐ సభ్యులు, సాంకేతిక బృందం చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించిన అంశాలను జిల్లా కలెక్టర్ అంకిత్‌కు వివరించారు. ప్రతిపాదిత ప్రాంతాలకు సంబంధించిన రెవెన్యూ, సర్వే, అటవీ, రహదారులు, రైల్వే, భౌగోళిక, వాతావరణ తదితర వివరాలను సాంకేతిక బృందానికి అందుబాటులో ఉంచాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.విమానాశ్రయ స్థల ఎంపికకు సంబంధించి పూర్తి స్థాయి సాంకేతిక అధ్యయనం, డేటా విశ్లేషణ, సిమ్యులేషన్ తదితర ప్రక్రియలకు సుమారు 6 నుంచి 8 వారాల సమయం పట్టే అవకాశం ఉందని సాంకేతిక బృందం తెలిపింది. అనంతరం సమగ్ర సాంకేతిక సాధ్యాసాధ్యాల నివేదికను రూపొందించనుంది.ప్రస్తుతం జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలన ప్రాథమిక సాంకేతిక అధ్యయనంలో భాగమేనని, ఏ ప్రతిపాదిత ప్రాంతాన్ని తుది విమానాశ్రయ స్థలంగా ఎంపిక చేసినట్లు ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదని అధికారులు స్పష్టం చేశారు. ఏఏఐ సాంకేతిక సాధ్యాసాధ్యాల నివేదిక, సంబంధిత శాఖల అనుమతులు, భౌగోళిక–పర్యావరణ అంశాలు, భవిష్యత్ కనెక్టివిటీ తదితర అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం మాత్రమే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.ఈ పరిశీలనలో కొత్తగూడెం ఆర్డీవో మధు, సిపిఓ సునీత, ములకలపల్లి తాసిల్దార్ స్వాతి బిందు, ఆర్అండ్ బి నాగేశ్వరరావు, సర్వే అధికారి సబ్బని లక్ష్మణ్ సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ