తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన గిరిజన యువతి, నర్స్ ఊకే శిరీషను అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి, ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాస్‌రావు డిమాండ్ చేశారు. శిరీష కుటుంబాన్ని బుధవారం పరామర్శించి ఘటన వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సింగ్ విద్యను పూర్తి చేసి హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న శిరీష దారుణ హత్యకు గురికావడం తీవ్ర దిగ్భ్రాంతికరమన్నారు. మహిళలు, ముఖ్యంగా గిరిజన మహిళలకు భద్రత లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిపై వేగంగా దర్యాప్తు పూర్తి చేసి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారిలో భయం కలిగేలా కఠిన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. శిరీష కుటుంబానికి ప్రభుత్వం తక్షణ న్యాయం చేయడంతో పాటు ఆర్థిక, భద్రతా సహాయం అందించాలని కోరారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చిన గడల శ్రీనివాస్‌రావు, తనవంతు సాయంగా రూ.30 వేల ఆర్థిక సహాయం అందించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ