తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వేతన హక్కుల కోసం ఐదు జాతీయ కార్మిక సంఘాల ఐక్య పోరాటం.. తక్షణమే వేజ్ బోర్డు కమిటీ ఏర్పాటు చేయాలని జేఏసీ డిమాండ్ 12వ వేజ్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 10న దేశవ్యాప్తంగా అన్ని బొగ్గు పరిశ్రమల ముఖ్య కార్యాలయాల ఎదుట ధర్నా లో బాగంగా సింగరేణి వ్యాప్తంగా అన్ని జిఎం కార్యాలయాల ముందు ఉదయం 9 గంటలకు ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ప్రకటించారు. జేబీసీసీఐ (JBCCI) సంఘాల పిలుపు మేరకు చేపట్టనున్న ఈ ఆందోళన కార్యక్రమంపై శుక్రవారం కొత్తగూడెంలోని ఏఐటీయూసీ కార్యాలయం శేషగిరిభవన్‌లో జేఏసీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య, ఐఎన్‌టీయూసీ నాయకులు త్యాగరాజు, సీఐటీయూ నాయకులు నర్సింహారావు, హెచ్‌ఎంఎస్ నాయకులు కృష్ణప్రసాద్, టీబీజీకేఎస్ నాయకులు తుమ్మ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆగస్టు 10న దేశవ్యాప్తంగా నిర్వహించే ధర్నాలో బీఎంఎస్ మినహా ఐదు జాతీయ కార్మిక సంఘాలు ఒకే వేదికపై ఐక్యంగా పాల్గొంటున్నాయని తెలిపారు.వేజ్ బోర్డు ఏర్పాటును ఎందుకు ఆలస్యం చేస్తున్నారు?కేంద్ర ప్రభుత్వం, బొగ్గు సంస్థల యాజమాన్యాలు నాలుగు లేబర్ కోడ్లను సాకుగా చూపిస్తూ 12వ వేజ్ బోర్డు ఏర్పాటును ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నాయని నాయకులు ఆరోపించారు. అలాగే “ఒక సంస్థ–ఒక యూనియన్” విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది కార్మికుల సంఘటిత హక్కులను బలహీనపరిచే చర్య అని విమర్శించారు.10వ వేజ్ బోర్డులో 20 శాతం, 11వ వేజ్ బోర్డులో 19 శాతం వేతన పెంపును సాధించామని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో 12వ వేజ్ బోర్డులో కనీసం 30 శాతం వేతన పెంపు సాధించడమే లక్ష్యంగా అన్ని కార్మిక సంఘాలు సమన్వయంతో పోరాటం చేస్తున్నాయని తెలిపారు. ఆరు నెలల ముందే కమిటీ.. ఇప్పుడు ఎందుకు జాప్యం?11వ వేజ్ బోర్డు అమలుకు ఆరు నెలల ముందుగానే కమిటీ ఏర్పాటు చేసిన విషయాన్ని నాయకులు గుర్తుచేశారు.అయితే జూలై 1 నుంచి ప్రారంభం కావాల్సిన 12వ వేజ్ బోర్డు కోసం ఇప్పటివరకు కమిటీని ఏర్పాటు చేయకపోవడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు.కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, 12వ వేజ్ బోర్డు కమిటీని తక్షణమే ఏర్పాటు చేసి చర్చలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వం, బొగ్గు సంస్థల యాజమాన్యాలను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి నాయకులు వంగ వెంకట్,వీరస్వామి,రమణమూర్తి, గట్టయ్య,సముద్రాల సుధాకర్,హుమాయూన్,సందబోయిన శ్రీనివాస్, భీమయ్య,నర్సింగరావు, ఐ ఎన్ టీ యు సి నాయకులు ఆల్బర్ట్, సి ఐ టి యు,మంద నర్సింహారావు, హెచ్ ఎం ఎస్ నాయకులు ఆంజనేయులు,ఆసిఫ్, టి బి జి కే ఎస్ నాయకులు తుమ్మ శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ