తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రధాన నిందితుడి అరెస్టు.. నేరార్జిత ఆస్తులుగా గుర్తించిన 35 వాహనాలు స్వాధీనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నెం.134/2026 కేసులో ప్రధాన నిందితుడు బేతంపూడి భరత్ కుమార్‌ను అరెస్టు చేసి, అతని వద్ద నుంచి నేరార్జిత ఆస్తులుగా భావిస్తున్న 35 వాహనాలు, ఇతర చరాస్తులను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ వివరాలను వెల్లడించడం జరిగింది. భార్పాటీ శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, నిందితుడు తాను భద్రాచలం ఐటీసీ పేపర్ బోర్డ్స్‌లో లేబర్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నానని, తనతో భాగస్వామిగా ఉంటే కాంట్రాక్ట్ పనులు ఇప్పించి అధిక లాభాలు అందిస్తానని నమ్మబలికి పలువురు బాధితుల నుంచి సుమారు రూ.52 కోట్ల మేర పెట్టుబడుల పేరుతో మోసపూరితంగా డబ్బులు సేకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. బాధితుల విశ్వాసాన్ని పొందేందుకు నకిలీ భాగస్వామ్య ఒప్పందాలు, తప్పుడు పత్రాలు రూపొందించి, లాభాల్లో 4 శాతం వాటా ఇస్తామని హామీలు ఇచ్చి మోసానికి పాల్పడినట్లు విచారణలో తేలిందని తెలిపారు. అలాగే బీకే నాయుడు అండ్ కో., రాజేశ్వరి ట్రావెల్స్ పేర్లతో సంస్థలను నిర్వహిస్తూ ఈ మోసపూరిత కార్యకలాపాలు సాగించినట్లు గుర్తించినట్లు వెల్లడించారు. సాంకేతిక ఆధారాలు, ఆర్థిక లావాదేవీల విశ్లేషణ ఆధారంగా నిందితుడిని కేరళ రాష్ట్రంలోని పాలా ప్రాంతంలో అరెస్టు చేసి, ట్రాన్సిట్ వారెంట్‌పై జిల్లాకు తీసుకువచ్చి పోలీసు కస్టడీలో విచారించినట్లు తెలిపారు. విచారణలో భాగంగా నేరార్జిత ఆస్తులుగా భావిస్తున్న 6 బస్సులు, ఒక వాటర్ ట్యాంకర్ లారీ, 3 ట్రాక్టర్లు, 2 వ్యవసాయ పరికరాలు, 7 కార్లు, 14 ద్విచక్ర వాహనాలు, 2 ట్రైలర్లు కలిపి మొత్తం 35 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా బాధితుల నుంచి మోసపూరితంగా సేకరించిన డబ్బుతో భద్రాచలంలోని రాజీవ్‌నగర్ కాలనీలో ఒక మూడు అంతస్తుల భవనం, ఒక ప్లాట్ కొనుగోలు చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ కేసులో ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు, సంబంధిత పత్రాల పరిశీలన కొనసాగుతోందని తెలిపారు. మరిన్ని బాధితులను గుర్తించడం, నేరార్జిత ఆస్తులను గుర్తించి స్వాధీనం చేసుకోవడం, పూర్తి మనీ ట్రైల్‌ను వెలికితీసే దిశగా దర్యాప్తు కొనసాగుతోందన్నారు. అధిక లాభాలు వస్తాయని, తక్కువ సమయంలో పెట్టుబడికి రెట్టింపు లేదా భారీ రాబడులు వస్తాయని చెప్పే వ్యక్తులు లేదా సంస్థలను గుడ్డిగా నమ్మి డబ్బులు పెట్టవద్దని ప్రజలకు సూచించారు. ఆకర్షణీయమైన హామీలు, నకిలీ పత్రాలు, తప్పుడు ఒప్పందాలతో మోసగాళ్లు ప్రజలను మభ్యపెడుతున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. అనుమానాస్పద పెట్టుబడి పథకాలపై సమాచారం తెలిసినా లేదా మోసానికి గురైనా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజల అప్రమత్తతతోనే ఇటువంటి ఆర్థిక నేరాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన లక్ష్మీదేవిపల్లి పోలీసు సిబ్బందిని, జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అభినందించారు .
Admin
తెలుగు వెలుగు టీవీ