తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలి : జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మావతి.భద్రాద్రి జిల్లాలో 2190.63 కేజీల గంజాయి సీజ్ విలువ రు. 11,20,81,500 మొత్తం 219 మందిని అరెస్టు పరారీలో ముగ్గురు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం, అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారిణి (డీ. ఆర్.ఓ) పద్మావతి అధికారులను మంగళవారం ఆదేశించారు. ఐడిఓసీ లోని జిల్లా అదనపు కలెక్టర్ ఛాంబర్లో జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నివారణ కమిటీతో సమావేశం మంగళవారం నిర్వహించి మాట్లాడారు.జిల్లాలో ఇప్పటివరకు 2190.63 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని, దాని విలువ రు. 11,20,81,500 ఉంటుందని, మొత్తం 219 మందిని అరెస్టు చేయాగా ముగ్గురు పరారీలో ఉన్నట్లు డి.ఆర్.ఓ కు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 65 మందిని డీ - అడిక్షన్ సెంటర్ కు తరలించినట్లు వివరాలు వెల్లడించారు. మాదకద్రవ్యాల వినియోగంతో వ్యక్తుల జీవితాలుదుర్భరమవుతాయని, ముఖ్యంగా యువత వీటి బారిన పడకుండా ముందస్తు అవగాహన కల్పించడం అత్యంత అవసరమన్నారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులు, యువత, కార్మికులకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు పటిష్ట నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలని తెలిపారు. కార్మికులు పనిచేసే ప్రాంతాల్లో గంజాయి సరఫరాపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని, మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం, రవాణా వంటి చర్యలను తీవ్రంగా పరిగణించాలని అన్నారు. సంబంధిత శాఖలన్నీ ప్రణాళికబద్ధంగా సమన్వయంతో పనిచేస్తూ నిరంతర తనిఖీలు నిర్వహించాలని సూచించారు.గత సమావేశం నుండి ప్రస్తుత సమావేశం వరకు నమోదైన కేసులు, వాటి పురోగతి, మాదకద్రవ్యాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సమగ్రంగా చర్చించారు.ఆర్టీసీ ద్వారా జరుగుతున్న అక్రమ రవాణాను అరికట్టేందుకు ఆర్టీసీ కండక్టర్లు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని, అనుమానాస్పద వస్తువులపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని డీ. ఆర్.ఓ ఆదేశించారు. గంజాయి అక్రమ రవాణా నిర్మూలనకు అన్ని శాఖలు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మిషన్ పరివర్తన అనే పథకంలో పాఠశాల, కళాశాల విద్యార్థులకు ప్రత్యేక అవగాహణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు డి.డబ్ల్యు.ఓ స్వర్ణలత లేనినా డీ.ఆర్.ఓ కు తెలిపారు. అదేవిధంగా వివిధ శాఖల అధికారులు డి.ఆర్.ఓకు తమ కార్యచరణలను వివరించారు.ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబూరావు,ఇల్లందు డిఎస్పీ వెంకన్న బాబు, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి హెచ్. వెంకటేశ్వర్లు, డీఈఓ కార్యాలయ అధికారి రామారావు,జిల్లా రవాణా శాఖ ఏ.ఏం. వి.ఐ శ్వేత,వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.సురక్షిత ఆహారం అందించాలి : జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మావతి. సురక్షితమైన ఆహారం, ఆరోగ్యం ప్రధాన ఉద్దేశ్యంగా ఆహార భద్రత శాఖ నిరంతరం పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారిణి (డీ. ఆర్.ఓ) పద్మావతి అన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ ఛాంబర్ లో ఆహార భద్రత పై మంగళవారం సమీక్ష సమావేశం అధికారులతో డి.ఆర్.ఓ నిర్వహించి మాట్లాడారు.జిల్లాలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని, కల్తీపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఆహార భద్రతా అధికారి శరత్ కు సూచించారు. జిల్లాలోని ప్రతి ఆహార వ్యాపార నిర్వాహకుడు FSSAI ఆహార లైసెన్స్ / రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా పొందాలని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ శరత్ ఈ సందర్భంగా డీ.ఆర్. ఓ కు తెలియజేసారు.ఆహార వ్యాపార నిర్వాహకులకు లైసెన్స్, రిజిస్ట్రేషన్ పొందే ప్రక్రియను సులభతరం చేయడానికి గతంలో ఆహార లైసెన్స్ & రిజిస్ట్రేషన్ మేళా నిర్వహించామని గుర్తుచేశారు.హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థలు, బేకరీలు, స్వీట్ షాపులు, కిరాణా దుకాణాలు, వీధి ఆహార విక్రయదారులు, ఆహార తయారీదారులు, హోల్సేల్ , రిటైల్ వ్యాపారులు, ఇతర అన్ని Food Business Operators (FBOs) ఈ మేళాను సద్వినియోగం చేసుకోగా 60మందికి రిజిస్ట్రేషన్లు చేసుకోవడం వలన ఫుడ్ లైసెన్స్ మంజూరు చేసామని తెలిపారు. తమ FSSAI లైసెన్స్ / రిజిస్ట్రేషన్ పొందాలని, రెన్యువల్ చేసుకోవాలని వ్యాపారులను డీ. ఆర్.ఓ సూచించారు.ప్రతి ఆహార వ్యాపారానికి FSSAI లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ ఉండటం చట్టబద్ధమైన బాధ్యత మాత్రమే కాకుండా, వినియోగదారులకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందించడంలో ముఖ్యమైన భాగం” అని తెలిపారు. భద్రాద్రి జిల్లాలో ఇప్పటివరకు తనిఖీలు చేపట్టి సర్వేలన్స్ శాంపిల్స్, ఎన్ఫోర్స్మెంట్ శాంపిల్స్ సేకరించి 59 నమోదు చేశామని డీ. ఆర్.ఓ లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ వైద్యులు డాక్టర్ ప్రతాప్ డీఈఓ కార్యాలయ అధికారి రాజ్ కుమార్, డిపిఓ కార్యాలయ అధికారి ఉమర్ ఫర్, ఫుడ్ అనాలసిస్ట్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ