తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నీటిపారుదల ప్రాజెక్టుల పనులకు ఆటంకం లేకుండా చర్యలు. పరిహారం, పునరావాస ప్రక్రియలను సత్వరం పూర్తి చేయాలి. పెండింగ్ భూసేకరణకు రూ.2,800 కోట్ల విడుదలకు చర్యలు. కొత్త ఆయకట్టు సృష్టించేలా భూసేకరణ పనులు పూర్తి చేయాలి. జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ, పరిహారం చెల్లింపు, పునరావాస ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.శుక్రవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో నీటిపారుదల ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్ భూసేకరణ, పరిహారం చెల్లింపు, పునరావాసం తదితర అంశాలపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ఐడీఓసీ కార్యాలయంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ అంకిత్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నీటిపారుదల ప్రాజెక్టుల పనులు సకాలంలో పూర్తయ్యేందుకు పెండింగ్ భూసేకరణను పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పెండింగ్ భూసేకరణ కోసం ప్రభుత్వం రూ.2,800 కోట్లను విడుదల చేసేందుకు చర్యలు చేపట్టిందని, ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారని అన్నారు .కొత్త ఆయకట్టు సృష్టించేందుకు వీలుగా పెండింగ్ భూసేకరణ, పునరావాస పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి సూచించారు. భూసేకరణకు అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నందున ఎక్కడా జాప్యం లేకుండా ప్రక్రియను పూర్తి చేసి, ప్రాజెక్టుల పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ , జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ, పరిహారం చెల్లింపు, పునరావాసానికి సంబంధించిన ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భూసేకరణకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కరించాలని సూచించారు.రైతులకు చెల్లించాల్సిన పరిహారం, పునరావాసానికి సంబంధించిన అంశాలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని, భూసేకరణ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల పనులు సజావుగా కొనసాగేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఇరిగేషన్ మరియు భూసేకరణ అధికారులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ