తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కార్మికుడిని మేయర్ చేయడం కమ్యూనిస్టులకే సాధ్యం.సమస్యల పరిష్కారానికి ఆటో కార్మికులు ఐక్యంగా పోరాడాలి.సంక్షేమ బోర్డు కోసం జరుగుతున్న ఉద్యమాలను పెడచెవినపెడుతున్న పాలకులు. ఏపీ రాష్ట్ర మహాసభల్లో మేయర్ మూడ్ గణేష్.విశాఖపట్నంలోని పబ్లిక్ లైబ్రరీ హాల్ నందు గురు, శుక్రవారాల్లో ఆంధ్రప్రదేశ్ ఆటో అండ్ మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర నాలుగవ మహాసభలు ఘనంగా జరిగాయి. ఈ మహాసభలకు ఆహ్వాన సంఘం పిలుపు మేరకు కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గతంలో తాను స్వయంగా ఆటో కార్మికుడిగా పనిచేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన సభలో గుర్తుచేసుకున్నారు. క్షేత్రస్థాయిలో రవాణా రంగ కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కష్టనష్టాలు తనకు పూర్తిగా తెలుసునని ఆయన పేర్కొన్నారు. ఒక సాధారణ ఆటో కార్మికుడి స్థాయి నుంచి కార్పొరేషన్ మేయర్‌గా అవకాశం కల్పించడం కేవలం కమ్యూనిస్టు పార్టీలకే సాధ్యమని స్పష్టం చేశారు. శ్రమజీవులను గుర్తించి ప్రజాప్రతినిధులుగా చట్టసభలకు, స్థానిక సంస్థలకు పంపే ఘనత ఎర్రజెండాకే దక్కుతుందని ఆయన కొనియాడారు. రవాణా రంగ కార్మికుల సంక్షేమం, భద్రత కోసం ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. మోటార్ కార్మికుల హక్కుల సాధనకు ఏఐటీయూసీ చేస్తున్న పోరాటాలు అభినందనీయమని, భవిష్యత్తులోనూ ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు. అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యూనియన్లు నిరంతరం ప్రజల్లో ఉంటూ గళం విప్పాలని సూచించారు. కార్మికుల పక్షాన నిలిచే నాయకులకు సమాజంలో ఎల్లప్పుడూ సముచిత స్థానం, ఆదరణ లభిస్తాయని ఈ సందర్భంగా వివరించారు. కార్మిక వర్గాల సంక్షేమానికి తన వంతు సహకారం ఎల్లవేళలా కొనసాగుతుందని మేయర్ మూడ్ గణేష్ హామీ ఇచ్చారు.
Admin
తెలుగు వెలుగు టీవీ