తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మేధావులను తయారు చేసే యోధులు ఉపాధ్యాయులు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర కీలకం.విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు క్రమశిక్షణ, విలువలు, సామాజిక బాధ్యతలను నేర్పిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేసే ఉపాధ్యాయులు నిజమైన యోధులని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక కొత్తగూడెం క్లబ్ లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. తరగతి గదుల్లో విద్యార్థుల ప్రతిభను గుర్తించి, వారిలోని సృజనాత్మకతను వెలికితీసి ఉన్నత శిఖరాలకు చేర్చడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. ఒక మంచి ఉపాధ్యాయుడి బోధన విద్యార్థి జీవితాన్నే మార్చగలదని పేర్కొన్నారు.సమాజ అభివృద్ధికి అవసరమైన మేధావులు, శాస్త్రవేత్తలు, అధికారులు, నాయకులు, వివిధ రంగాల నిపుణులను తీర్చిదిద్దేది గురువులేనని అన్నారు. అందుకే ఉపాధ్యాయుల సేవలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి, గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు, సీఈఓ నాగలక్ష్మి ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ