తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భూభారతితో రైతులకు న్యాయం జరగాలి.వాస్తవ సాగుదారులకే పట్టాలు ఇవ్వాలి.ప్రభుత్వ భూములు, డొంక దారులు రక్షించాలి.తెలంగాణ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. భూభారతి రీ-సర్వే ద్వారా చిన్న, సన్నకారు రైతులకు పూర్తి న్యాయం జరిగేలా పారదర్శకంగా చర్యలు చేపట్టాలని తెలంగాణ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి, మాజీ కౌన్సిలర్ భూక్య శ్రీనివాస్ డిమాండ్ చేశారు. భూభారతి పైలట్ ప్రాజెక్టు కింద రామవరం రెవెన్యూ గ్రామం ఎంపికైన సందర్భంగా చిట్టి రామవరంలో నిర్వహించిన గ్రామసభ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. మూడు తరాలుగా సాగులో ఉన్న అర్హులైన రైతులందరికీ క్షేత్రస్థాయి పరిశీలన జరిపి వెంటనే పట్టాలు మంజూరు చేయాలన్నారు. రికార్డుల్లోని తప్పులను సరిచేసి రైతులకు సంక్షేమ పథకాలు దక్కేలా చూడాలన్నారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు అన్యాక్రాంతం కాకుండా స్పష్టమైన హద్దులు నిర్ణయించాలన్నారు. రైతుల రాకపోకలకు ఆధారమైన డొంక దారులను గుర్తించి రికార్డుల్లో నమోదు చేయాలని కోరారు. రైతుల అభ్యంతరాలను స్వీకరించి ఎలాంటి వివాదాలు లేకుండా సర్వే పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో రైతులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ