తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : స్థలాల సమగ్ర పరిశీలన వేగవంతం శుభపరిణామం పారిశ్రామిక, వాణిజ్య రంగాలు మరింత పురోగతి జిల్లా ప్రజల చిరకాల స్వప్నం సాకారం దిశగా అడుగులు నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు : సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధిస్తుందని, వాణిజ్య, పారిశ్రామిక, పర్యాటక రంగాలు కొత్త పుంతలు తొక్కుతాయని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా అన్నారు. కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించి ముందస్తు సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) మల్టీ-డిసిప్లినరీ బృందం సోమవారం జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా సుజాతనగర్, చుంచుపల్లి మండలాల్లోని పలు ప్రాంతాల్లో విమానాశ్రయ నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాలను అధికారుల బృందం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పరిశీలించింది. ఏఏఐ బృందంతో కలిసి కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా ప్రతిపాదిత భూములు, సరిహద్దులు, రవాణా సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు, తొలుత పుష్పగుచ్చాన్ని అందించి స్వాగతం పలికారు. పరిశీలన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ సహకారంతో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన కృషి ఫలించిందని అందులోభాగంగానే జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు దిశగా కేంద్ర సాంకేతిక బృందం రాక కీలకమైన అడుగని పేర్కొన్నారు. విమానాశ్రయ రాకతో మారుమూల ఏజెన్సీ, పారిశ్రామిక ప్రాంతానికి మెరుగైన కనెక్టివిటీ లభించడమే కాకుండా స్థానిక యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రెవెన్యూ, సర్వే అధికారులు సమగ్ర భూ వివరాలు, నివేదికలను ఏఏఐ బృందానికి పూర్తిస్థాయిలో అందించాలని కోరారు. ఎయిర్‌పోర్ట్ నిర్మాణం సాకారమయ్యేందుకు అవసరమైన అన్ని రకాల సాంకేతిక, పరిపాలనా అనుమతులను వేగవంతం చేయాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బోయిన విజయ్ కుమార్, దుర్గయ్య, దాసరి శ్రీనివాస్, నాయకులు ఎండి యూసుఫ్, గడ్డం సతీష్కుమార్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ