తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి. ప్రణాళికాబద్ధంగా హైలెవెల్ వంతెనల నిర్మాణం పూర్తిచేస్తాం.ప్రజల అవసరాలు, సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యం. కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు.ఏజెన్సీ ప్రాంతాల సమగ్ర వికాసానికి, మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు తెలిపారు. లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని హేమచంద్రపురం - అనిశెట్టిపల్లి గ్రామాల మధ్య గల ముర్రేడు వాగుపై రూ.7.00 కోట్ల వ్యయంతో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. అదేవిధంగా రేగళ్ల ప్రాంతంలోని మున్యాతండా - పెద్దతండా గ్రామాల మధ్య గంగమ్మగుడి వాగుపై రూ.1.80 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించబోయే మరో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతాల్లో గ్రామీణ రవాణా వ్యవస్థను మెరుగుపరచడం, గ్రామాల మధ్య అనుసంధానాన్ని పెంచడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. వర్షాకాలంలో వాగులు ఉప్పొంగి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయే మారుమూల గ్రామీణ, ఏజెన్సీ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వంతో పోరాడి నిధులు మంజూరు చేయించామని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల సమీకరణలో ఎక్కడా రాజీపడేది లేదని స్పష్టం చేశారు. ఈ వంతెనల నిర్మాణం పూర్తయితే పరిసర గ్రామాల ప్రజలకు సత్వర రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమాల్లో ఎంపిడివో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, ఎంపిడివో సుస్మిత, తహశీల్దార్ శిరీష, అధికారులు రఘురామయ్యా, శ్రీకాంత్, కార్యవర్గ సభ్యులు చంద్రగిరి శ్రీనివాసరావు, మండల కార్యదర్శి దీటి లక్ష్మీపతి, రత్నకుమారి, సర్పంచులు అంజలి, పూర్ణ, హతిరామ్, వీరబాబు, దేవరగట్ల రాంబాబు, సపావట్ రవి, జర్పుల ఉపేందర్, గోవిందు, వెంకటనర్సయ్య, సత్యనారాయణ, ఎల్లావుల ఉపేందర్, బైకాని కృష్ణ, పూర్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ