తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రెండవ ప్రమాద హెచ్చరిక నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తం. లోతట్టు ప్రాంతాల ప్రజలు వెంటనే పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలి. ప్రజల సహాయార్థం 24 గంటలు ఫ్లడ్ కంట్రోల్ రూమ్ సేవలు అందుబాటులో ఉన్నాయి.భద్రాచలం వద్ద గోదావరి నదికి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ అయిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి శుక్రవారం భద్రాచలం వద్ద గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.మొదట విస్తా కాంప్లెక్స్ స్లూయిస్ వద్ద వరద నీటి పారుదల పరిస్థితి, మోటార్ల పనితీరును ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నీరు వేగంగా బయటకు వెళ్లేలా మోటార్లను నిరంతరం నిర్వహించాలని, ఎటువంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.అనంతరం కరకట్టపై నుంచి గోదావరి వరద ఉధృతిని పరిశీలించిన కలెక్టర్, స్నానఘాట్ల వద్ద పరిస్థితిని సమీక్షించారు. గోదావరిలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలను అనుమతించరాదని, ప్రమాద ప్రాంతాల వద్ద నిరంతర నిఘా కొనసాగిస్తూ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని పోలీసు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు.అలాగే కూనవరం–భద్రాచలం ప్రధాన రహదారిపై గోదావరి వరద నీరు ఎక్కడ వరకు చేరిందనే వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. రహదారుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ , భద్రాచలం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరిలో వరద ప్రవాహం వేగంగా పెరుగుతోందన్నారు. శుక్రవారం గోదావరి నీటిమట్టం 48.00 అడుగులకు చేరుకోవడంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 11,44,645 క్యూసెక్కుల వరద నీరు దిగువకు ప్రవహిస్తోందని, నీటిమట్టం 53 అడుగులకు చేరితే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు తెలిపారు.లోతట్టు ప్రాంతాల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఆలస్యం చేయకుండా పునరావాస కేంద్రాలకు తరలించేలా అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంచామని తెలిపారు. పునరావాస కేంద్రాల్లో తాగునీరు, ఆహారం, విద్యుత్, పారిశుధ్యం, వైద్య సేవలు, మహిళలు, చిన్నారులు, వృద్ధులకు అవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించాలని సంబంధిత శాఖలకు ఆదేశించారు.వరదల కారణంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్, పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్య, విద్యుత్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ ప్రజల నుంచి వచ్చే ప్రతి సమాచారంపై వెంటనే స్పందించి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా యంత్రాంగం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని, ఎన్‌డీఆర్‌ఎఫ్ (NDRF), ఎస్‌డీఆర్‌ఎఫ్ (SDRF), డీఆర్‌ఎఫ్ (DRF) బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు భద్రాచలం ఫ్లడ్ కంట్రోల్ రూమ్ 24 గంటల పాటు పనిచేస్తోందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఫ్లడ్ కంట్రోల్ రూమ్ ఫోన్: 08744-241950, వాట్సాప్: 9392919743 ద్వారా సమాచారం అందించాలని సూచించారు. ప్రజలు వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, అధికారులు ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ , గోదావరి వరద ఉధృతి అధికంగా ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గోదావరిలోకి దిగరాదని, సెల్ఫీలు, వీడియోల కోసం ప్రమాద ప్రాంతాలకు వెళ్లి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోవద్దని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే ఫ్లడ్ కంట్రోల్ రూమ్‌ను లేదా 100 నంబర్‌కు సమాచారం అందించి పోలీసు సహాయం పొందాలని సూచించారు. జిల్లా పోలీసు యంత్రాంగం ఇతర శాఖలతో సమన్వయంతో ప్రజల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతోందని తెలిపారు.ఈ పరిశీలనలో ఇరిగేషన్ ఎస్సీ మహేశ్వర రావు, దేవస్థానం ఈవో దామోదర్ రావు, భద్రాచలం తాసిల్దార్ రామకృష్ణ, మిషన్ భగీరథ ఈఈ తిరుమలేష్, ఎన్ డి ఆర్ ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్, డిడి ఆర్ఎఫ్ అధికారులు,తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ