తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నివాసాల మధ్య డంపింగ్ యార్డు తొలగించాలి. చెత్త తగులబెట్టడంతో రోగాల బారిన జనం. శ్మశానవాటిక సమస్యను వెంటనే పరిష్కరించాలి. సిపిఐ 1 టౌన్ కార్యదర్శి నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు. నివాస గృహాల మధ్య ఏర్పాటు చేసిన చెత్త డంపింగ్ యార్డును తక్షణమే వేరే ప్రాంతానికి తరలించాలని సిపిఐ 1 టౌన్ కార్యదర్శి నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాత కొత్తగూడెం నివాసాల సమీపంలో కార్పొరేషన్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారంటూ స్థానిక ప్రజలతో కలిసి యార్డు వద్ద సోమవారం నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు నివసించే నివాసాల చెంతనే యార్డును ఏర్పాటు చేసి రోజూ చెత్తను తగులబెడుతుండటంతో వెలువడుతున్న విషవాయువుల వల్ల స్థానికులు తీవ్రమైన ఊపిరితిత్తుల, చర్మ సంబంధిత అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం శ్మశానవాటికకు వెళ్లే రహదారికి సైతం అడ్డంగా చెత్తను కుప్పలుగా వేయడంతో, మృతదేహాలను దహనం, ఖననం చేసేందుకు స్థానికులు నరకయాతన అనుభవిస్తున్నారని మండిపడ్డారు. శవాలను డంపింగ్ యార్డు ఇవతలనే ఖననం చేయాల్సిన దుస్థితి నెలకొనడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. స్థానిక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం మానుకొని, డంపింగ్ యార్డును జనావాసాలకు దూరంగా తరలించకపోతే కార్పొరేషన్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు భవాని ప్రసాద్, నాగరాజు, బండి మంగ, అరుణ, రామ్మూర్తి, రామారావు, సరోజిని, సాయి, మంద బాబు, రాంపండు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ