తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కరకగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో జారీకి ఆదేశం రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి.. సిబ్బంది సమయపాలన పాటించాలి జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం కరకగూడెం మండలంలో పర్యటించి, ముందుగా బట్టుపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం కరకగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవలు, సిబ్బంది హాజరు, రోగులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. బట్టుపల్లి రెవెన్యూ పరిధిలో సుమారు 1,160 ఎకరాల విస్తీర్ణంలో చేపడుతున్న భూ రీ సర్వే పనుల పురోగతిని కలెక్టర్ సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆధునిక డీజీపీఎస్, జీఎన్ఎస్ఎస్ రోవర్ పరికరాల సహాయంతో భూముల సరిహద్దులను ఖచ్చితంగా గుర్తిస్తూ సర్వే నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరించారు. సర్వే నంబర్ల వారీగా భూముల హద్దులను పరిశీలిస్తూ, అటవీ భూములు, రైతుల పట్టా భూముల మధ్య ఉన్న సరిహద్దు రాళ్లను గుర్తించి, వాటి వివరాలను సాంకేతిక పరికరాల ద్వారా నమోదు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ , భూ రీ సర్వేను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రైతుల భూముల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా రెవెన్యూ రికార్డులు, పట్టా వివరాలు, క్షేత్రస్థాయి కొలతలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం భూముల సరిహద్దులను నిర్ధారించాలని స్పష్టం చేశారు. అటవీ భూములు, పట్టా భూముల మధ్య సరిహద్దుల నిర్ధారణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సర్వే సందర్భంగా రైతులకు ఎదురయ్యే సందేహాలు, సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కరించాలని సూచించారు. రెవెన్యూ, సర్వే, అటవీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సర్వే పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, భూముల హద్దులపై స్పష్టత తీసుకువచ్చి భవిష్యత్తులో భూ వివాదాలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ కాంతయ్య, సర్వేయర్ సందీప్, బట్టుపల్లి సర్పంచ్ తోలేం రమాదేవి, సంబంధిత వైద్య సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ