తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఓటర్ల జాబితా సవరణలో బిఎల్ఏల పాత్ర కీలకం. అర్హులైన ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత బిఎల్ఏలదే.క్షేత్రస్థాయిలో సర్వేలో చురుగ్గా పాల్గొనాలి. బోగస్ ఓట్ల తొలగింపుపై ప్రత్యేక నిఘా ఉంచండి.కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణపై ప్రజల్లో అవగాహన తేవాలి.పార్టీ పటిష్టతకు బూత్ కమిటీలు సమన్వయంతో పనిచేయాలి. బిఎల్ఏల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో బూత్ లెవల్ ఏజెంట్ల (బిఎల్ఏ) పాత్ర అత్యంత కీలకమని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. ఆదివారం స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయం 'శేషగిరి భవన్'లో నిర్వహించిన లక్ష్మీదేవిపల్లి మండల స్థాయి సిపిఐ పక్ష బూత్ లెవల్ ఏజెంట్ల (బిఎల్ఏ)ల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత బిఎల్ఏలదేనని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వీడి క్షేత్రస్థాయిలో జరిగే సర్వేలో బీఎల్వోలతో కలిసి చురుగ్గా పాల్గొనాలని సూచించారు. నియోజకవర్గ పరిధిలో బోగస్ ఓట్ల తొలగింపుపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అర్హత లేని వారిని గుర్తించి అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. చనిపోయిన వారు, వలస వెళ్ళిన వారి వివరాలను జాబితా నుండి తొలగించేలా చూడాలని, అర్హులైన యువతీ యువకులకు నూతన ఓటర్ల నమోదు, కార్డుల్లో తప్పుల సవరణపై ప్రజల్లో విస్తృత అవగాహన తేవాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో బూత్ కమిటీలు సమన్వయంతో పనిచేస్తూ పార్టీ పటిష్టతకు, బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రగిరి శ్రీనివాసరావు, కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్, మండల కార్యదర్శి దీటి లక్ష్మీపతి, జిల్లా సమితి సభ్యులు మామిడాల ధనలక్ష్మి, నాయకులు సపావట్ రవి, జర్పుల ఉపేందర్, కళ్లెం సత్యనారాయణ, హత్తిరమ్ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ