తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తన కుమారుడిని గొప్ప విద్యావేత్తగా తీర్చిదిద్ది, కొత్తగూడెం ఏజెన్సీ జిల్లాలో అనేకమంది విద్యావంతులు కావడానికి పరోక్షంగా కారణమైన మాతృమూర్తి రామతులశమ్మ సేవలు ఎల్లప్పటికీ చిరస్మరణీయమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. కొత్తగూడెంలోని ప్రముఖ త్రివేణి, కృష్ణవేణి విద్యాసంస్థల డైరెక్టర్ మాచవరపు కోటేశ్వరరావు తల్లిగారైన మాచవరపు రామతులశమ్మ మృతిచెందిన విషయం తెలుసుకున్న ఆయన గురువారం ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల మండలం, పరిటాల గ్రామంలోని కోటేశ్వరరావు స్వగ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఉంచిన రామతులశమ్మ మృతదేహంపై పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతం నుండి వచ్చి, తన కుమారుడిని ఉన్నత విద్యావేత్తగా తీర్చిదిద్దడమే కాకుండా, ఈ ఏజెన్సీ ప్రాంతంలోని వేలాది మంది విద్యార్థులకు విద్యాదానం చేసేలా ప్రోత్సహించిన రామతులశమ్మ నిజమైన ఆదర్శ మాతృమూర్తి అని కొనియాడారు. ఆమె మరణం విద్యా రంగానికి, వారి కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. రామతులశమ్మ మృతిపట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు సంతాపాన్ని, కుటుంబ సభ్యలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు, కోటేశ్వరరావుతోపాటు కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ