తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భూ రీ-సర్వేను అత్యంత ప్రాధాన్యతగా చేపట్టాలి... రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి భూ భారతి విజయవంతమైన అమలుకు భూ రీ-సర్వేనే కీలకం మార్చి-2027 నాటికి మూడు విడతల్లో రీ-సర్వే పూర్తి చేయాలి రీ-సర్వేలో పనిచేసే లైసెన్స్ సర్వేయర్లకు ఎకరానికి రూ. 60 చెల్లింపు సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, 2బీహెచ్‌కే ఇళ్ల పంపిణీని వేగవంతం చేయాలి ఆగస్టు 15 నాటికి ప్రతి విద్యార్థికి కనీసం ఒక జత యూనిఫాం అందించాలి భూ రీ-సర్వే, ఇందిరమ్మ ఇండ్లు, సాదా బైనామా దరఖాస్తులపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర మంత్రి పొంగులేటి భూ భారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట్రవ్యాప్తంగా భూ రీ-సర్వేను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. భూ రీ-సర్వే, భూ భారతి అమలు, సదాబైనామా దరఖాస్తుల పరిష్కారం, ఇందిరమ్మ ఇండ్లు, 2బీహెచ్‌కే ఇళ్ల పంపిణీ, పాఠశాల విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ తదితర అంశాలపై మంత్రి, శనివారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐ డి ఓ సి కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ అంకిత్ అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధరణిని రద్దు చేసి భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని, రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. భూ భారతి అమల్లోకి వచ్చి 15 నెలలు పూర్తయినా ప్రజల అంచనాలకు పూర్తిస్థాయిలో చేరలేకపోయామని తెలిపారు. ధరణి కాలంలో పెండింగ్‌లో ఉన్న 9.26 లక్షల సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం కోసం భూ భారతిలో అవకాశం కల్పించి, హైకోర్టు సమస్యను కూడా పరిష్కరించినప్పటికీ అధిక సంఖ్యలో దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయనే అభిప్రాయం ప్రజల్లో ఉందని, తిరస్కరణ లకు గల కారణాలను గుర్తించి పరిష్కరించా లని అధికారులను ఆదేశించారు.
జిల్లాలో భూ సర్వే పురోగతిని జిల్లా కలెక్టర్ అంకిత్ మంత్రికి వివరించారు. అక్కినేపల్లి గ్రామంలో మొత్తం 8,990 ఎకరాలకు గాను సుమారు 4,900 ఎకరాల సర్వే పూర్తయిందని తెలిపారు. గుండాల మండలంలో సర్వే పనులు కొనసాగుతున్నాయని, పెద్దవేంకటాపురం గ్రామంలో 537 ఎకరాలు, శుభంపేట గ్రామంలో 267 ఎకరాల సర్వే పూర్తయిందన్నారు. మాదారం గ్రామంలో సోమవారం నుంచి రీ-సర్వే ప్రారంభించనున్నట్లు తెలిపారు. సీతారామ ఎత్తిపోతల పథకం పరిధిలో ఈ నెలలోనే 5,000 ఎకరాలకు భూ సర్వే చేపట్టినట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో మొత్తం 17 గ్రామాల్లో రీ-సర్వే నిర్వహణకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని, తొలి దశలో 14 గ్రామాలను ఎంపిక చేసి పాల్వంచ, గుండాల, పినపాక, దుమ్ముగూడెం, బూర్గంపాడు మండలాల్లో సుమారు 4,000 ఎకరాల సర్వే పూర్తి చేసే లక్ష్యంతో చర్యలు చేపట్టామని వివరించారు. జిల్లాలో మొత్తం 206 మంది లైసెన్స్ సర్వేయర్లు ఉన్నారని, వారిలో 56 మంది జిల్లాకు కేటాయించబడ్డారని కలెక్టర్ తెలిపారు. కేటాయించబడిన వారిలో ఇప్పటికే 16 మంది విధుల్లో చేరి భూ రీ-సర్వే పనులు నిర్వహిస్తున్నారని, మిగిలిన వారు కూడా త్వరలో విధుల్లో చేరనున్నట్లు వివరించారు. విధుల్లో చేరిన సర్వేయర్లకు రిటైర్డ్ సర్వేయర్ల ద్వారా అవసరమైన శిక్షణ అందిస్తున్నట్లు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కొత్తగూడెం ఆర్డీవో మధు, ఏడి ల్యాండ్ సర్వే అధికారి శ్రీనివాసరావు, తాసిల్దార్ లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ