తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 24×7 కంట్రోల్ రూమ్ ద్వారా ప్రజలకు తక్షణ సేవలు : జిల్లా కలెక్టర్ అంకిత్.వర్షాల అత్యవసర పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ – అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి వర్షాకాల పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే స్పందించేలా జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు.వర్షాల కారణంగా తలెత్తే అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా కేంద్రంలోని ఐ టి ఓ సి కార్యాలయంలో జీ–19 గదిలో 24×7 జిల్లా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 3, సోమవారం నుంచి వివిధ శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగులను మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించేలా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు.ఉదయం 7.00 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు, మధ్యాహ్నం 2.00 గంటల నుంచి రాత్రి 9.00 గంటల వరకు, రాత్రి 9.00 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 7.00 గంటల వరకు మూడు షిఫ్టుల్లో కంట్రోల్ రూమ్ నిరంతరాయంగా పనిచేస్తుందని తెలిపారు.ప్రజల నుంచి కంట్రోల్ రూమ్‌కు అందే ఫిర్యాదులు, సమాచారం, వర్షాల కారణంగా తలెత్తే అత్యవసర పరిస్థితులను వెంటనే నమోదు చేసి సంబంధిత శాఖలకు సమాచారం అందిస్తూ తక్షణ చర్యలు చేపట్టేలా సమన్వయం చేయాలని విధుల్లో ఉన్న సిబ్బందిని ఆదేశించారు. అందిన ప్రతి ఫిర్యాదును ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేసి, దానిపై తీసుకున్న చర్యల వివరాలను కూడా నమోదు చేయాలని సూచించారు.జిల్లాలో వర్షాల పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడైనా రహదారులు దెబ్బతినడం, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండడం, వాగులు, వంకలు పొంగిపొర్లడం వంటి పరిస్థితులు తలెత్తిన వెంటనే సంబంధిత శాఖలు స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.సంబంధిత శాఖల జిల్లా అధికారులు తమ శాఖలకు కేటాయించిన అధికారులు, ఉద్యోగులు విధులకు తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఎవరైనా సెలవులో ఉన్నట్లయితే వారి స్థానంలో వెంటనే ప్రత్యామ్నాయ సిబ్బందిని నియమించాలని కలెక్టర్ ఆదేశించారు.అత్యవసర పరిస్థితుల దృష్ట్యా కంట్రోల్ రూమ్‌లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా లేదా ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అంకిత్ హెచ్చరించారు.వర్షాల కారణంగా అత్యవసర పరిస్థితులు లేదా ఇతర సమస్యలు ఎదురైనప్పుడు ప్రజలు జిల్లా కంట్రోల్ రూమ్ 08744-241950 నంబర్‌కు సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ కోరారు. ప్రజల నుంచి అందే ప్రతి సమాచారంపై వెంటనే స్పందించి అవసరమైన చర్యలు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం అన్ని వేళలా సిద్ధంగా ఉంటుందని తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ