తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిపై సోమవారం జరిగిన దాడిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ మాట్లాడుతూ.. భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన ఈ అమానుషమన్నారు. ఇది ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదని, మొత్తం న్యాయవ్యవస్థపై, న్యాయ స్వాతంత్ర్యంపై, రాజ్యాంగ విలువలపై జరిగిన ఘోర దాడి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుశ్చర్య న్యాయ వృత్తి గౌరవాన్ని దెబ్బతీయడానికి, న్యాయస్వాతంత్ర్యాన్ని క్షీణింపజేయడానికి చేసిన ఒక కుతంత్రంగా భావిస్తున్నామన్నారు. అదే విధంగా, ఈ ఘటనకు నిరసనగా మంగళవారం జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించాలని కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడటం న్యాయవాదులుగా తమ బాధ్యత మాత్రమే కాదని, తమ కర్తవ్యమని, న్యాయవృత్తి గౌరవ రక్షణలో అందరూ ఏకతాటిపై నిలబడి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బార్ ఉపాధ్యక్షులు జె. గోపికృష్ణ, ప్రధాన కార్యదర్శి భాగం మాధవరావు, సహాయ కార్యదర్శి కాసాని రమేష్, కార్యవర్గ సభ్యులు మాలోత్ ప్రసాద్, కె. చిన్నికృష్ణ, అడపాల పార్వతి తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ