తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జీపీ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అమలుకు కృషి.ఏళ్లు గడుస్తున్నా ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాల కల్పించకపోవడం సిగ్గుచేటు.కార్మికులకు నష్టం కలిగించే జీవో 51 రద్దుకు అసెంబ్లీలో ప్రస్తావిస్తా.కార్మికుల న్యాయమైన హక్కుల సాధన కోసం సమిష్టిగా పోరాడాలి.ఇందిరమ్మ ఇళ్ల ప్రత్యేక కోటా కోసం ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తా. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.గ్రామ పంచాయతీల్లో నిరంతరం సేవలందిస్తున్న కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హామీ ఇచ్చారు. పాల్వంచ పట్టణంలోని సీఆర్ భవన్లో శుక్రవారం ఏఐటీయూసీ అనుబంధ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ పాల్వంచ మండల స్థాయి మహాసభ జరిగింది. ఈ మహాసభకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.26 వేలు ఇవ్వాలని, పని భద్రత కల్పించాలని, అలాగే జీవో నంబర్ 60 ప్రకారం వేతనాలు అమలు చేయాలని కార్మికులు కోరుతున్నారని ఆయన పేర్కొన్నారు. కార్మికులకు నష్టం కలిగించే జీవో నంబర్ 51 (మల్టీపర్పస్ విధానం) రద్దు అంశంపై అసెంబ్లీలో గళమెత్తుతానని చెప్పారు. కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించడం, ఉద్యోగ భద్రతతో పాటు రూ.10 లక్షల ఇన్సూరెన్స్ భరోసా, యూనిఫాంలు, శానిటైజర్ కిట్లు అందించేలా సంబంధిత శాఖ మంత్రి, ఉన్నతాధికారులతో చర్చిస్తానని తెలిపారు. సొంత ఇల్లు లేని అర్హులైన పంచాయతీ కార్మికులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరుకు ప్రత్యేక కేటాయింపు జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని ఆయన స్పష్టం చేశారు. కార్మికులు ఎదుర్కొంటున్న ప్రతీ సమస్యను పరిష్కరించేందుకు తనవంతుగా పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్, బికేయంయు జిల్లా అధ్యక్షులు వీసంశెట్టి పూర్ణచంద్రరావు, ఎఐటియుసి జిల్లా నాయకులు యూసుఫ్, అన్నారపు వెంకటేశ్వర్లు నిమ్మల రాంబాబు ఇట్టి వెంకట్రావు, యూనియన్ నాయకులు లంబా నాయక్, బాలకృష్ణ, శ్రీనివాస్, రామకృష్ణ, శ్రీను, లెనిన్, మమత, వినయ్, రామనాధం, రవి, దుర్గా, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ