తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం ఇల్లందులోని రాజస్థాన్ సేవా ట్రస్ట్ ఫంక్షన్ హాల్లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇల్లందు సింగరేణి జనరల్ మేనేజర్ వీసం కృష్ణయ్య హాజరయ్యారు.ఈ సందర్భంగా ఇల్లందు డీఎస్పీ వెంకన్నబాబు మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సమాజ సేవలో భాగంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న ఎంతోమంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ముఖ్యంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు తరచుగా రక్తం అవసరమవుతుందని, వారి ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ శిబిరంలో సేకరించిన రక్తాన్ని తలసేమియా బాధితుల అవసరాల కోసం సంకల్ప సేవా సమితికి అందజేయనున్నట్లు వెల్లడించారు.యువకులు, విద్యార్థులు, పోలీస్ అధికారులు, సిబ్బంది, తదితరులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరినీ అధికారులు అభినందించి, వారికి ప్రశంసాపత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో సీఐలు సురేష్, సత్యనారాయణ, తిరుపతి, పోలీస్ అధికారులు, సిబ్బంది, యువకులు, విద్యార్థులు, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ