తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రూ.70 లక్షలు మంజూరై రెండేళ్లు గడిచినా ప్రారంభంకాని నిర్మాణ పనులు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు బూడిదిగడ్డ పరిరక్షణ కమిటీ వినతి 10, 11, 49వ డివిజన్ల ప్రజలకు ఉపయోగపడేలా నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్ బూడిదిగడ్డ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని బూడిదిగడ్డ పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శిలాఫలకం ఏర్పాటు చేసి, 2024 సంవత్సరంలో కొత్తగూడెం మున్సిపాలిటీ ద్వారా రూ.70 లక్షల నిధులు మంజూరు చేసినప్పటికీ, ఇప్పటివరకు నిర్మాణ పనులు ప్రారంభం కాలేదని కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ నేపథ్యంలో బూడిదిగడ్డ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన చేసిన ప్రదేశంలో 10వ డివిజన్‌తో పాటు 11వ, 49వ డివిజన్లకు చెందిన ప్రజలు సమావేశమయ్యారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఆలస్యం కావడానికి గల కారణాలను పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించేలా కార్పొరేషన్ అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును కోరుతూ వినతిపత్రం సమర్పించారు. బూడిదిగడ్డతో పాటు పరిసర డివిజన్ల ప్రజలకు కమ్యూనిటీ హాల్ ఎంతో అవసరమని, వివాహాలు, సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు, ప్రజా అవసరాలకు ఈ భవనం ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. ప్రజల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని మంజూరైన నిధులను వినియోగించి కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని ఇకపై ఎలాంటి ఆలస్యం లేకుండా ప్రారంభించి పూర్తి చేయాలని కోరారు. “మంజూరైన నిధులతో పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు?” ఇప్పటికే నిధులు మంజూరై, శిలాఫలకం ఏర్పాటు చేసిన నేపథ్యంలో నిర్మాణ పనులు ఎందుకు ప్రారంభం కాలేదో సంబంధిత అధికారులు ప్రజలకు స్పష్టత ఇవ్వాలని బూడిదిగడ్డ పరిరక్షణ కమిటీ కోరింది. ప్రజల దీర్ఘకాలిక అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో మాజీ కొత్తగూడెం మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ దామోదర్ యాదవ్, ఈరెల్లి నాగేశ్వరరావు, గొడుగు శ్రీధర్ యాదవ్, కామ్రేడ్ పలనాటి ప్రశాంత్, ఈసం చిన్నస్వామి, సబ్బని సంపత్, ఎండి కాజా, రాజయ్య, రాజు తదితరులు, అలాగే బూడిదిగడ్డ బస్తీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ