తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దసరా పర్వదినం సందర్భంగా రావణాసుర దహనం కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా ఉపయోగిస్తున్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌కు చెందిన క్వార్టర్‌లో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ చిత్రపటాలను రావణాసురుడి రూపంలో ఏర్పాటు చేసి దహనం చేసిన ఘటనపై భారతీయ జనతా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈరోజు సింగరేణి అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సదరు క్వార్టర్ ఎవరి పేరుపై కేటాయించబడింది, ఏ ప్రాతిపదికన కేటాయించారు, ప్రస్తుతం దానిని ఎవరు వినియోగిస్తున్నారు అనే తదితర వివరాలను సంబంధిత అధికారులను కోరారు. సింగరేణి సంస్థకు చెందిన అధికారిక ఆస్తిని రాజకీయ పార్టీ కార్యాలయంగా ఉపయోగించడం, ఆ ప్రాంగణంలో వివాదాస్పదమైన మరియు రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్యక్రమాలు నిర్వహించడం వంటి అంశాలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.సింగరేణి అధికారులు ఈ వినతిపై సానుకూలంగా స్పందించి, సదరు క్వార్టర్‌కు సంబంధించిన వివరాలను సంబంధిత విభాగానికి తెలియజేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే తగిన చర్యలు తీసుకోవాలని, సింగరేణి సంస్థకు చెందిన క్వార్టర్‌ను నిబంధనల ప్రకారం స్వాధీనం చేసుకోవాలని బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “సింగరేణి సంస్థ ప్రజల ఆస్తి. సంస్థకు చెందిన అధికారిక క్వార్టర్లను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడం, వాటిలో వివాదాస్పద కార్యక్రమాలు నిర్వహించడం వంటి అంశాలను సంస్థ అధికారులు తీవ్రంగా పరిగణించాలి. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనల ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. సదరు క్వార్టర్‌ను నిబంధనల ప్రకారం స్వాధీనం చేసుకోవాలి” అని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జాటోత్ వెంకన్న నాయక్, భారతీయ జనతా యువమోర్చా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు జుజ్జూరు మోహనకృష్ణ, యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కోల హరీష్ తదితరులు పాల్గొని సింగరేణి అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ