తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆర్‌వోబీలు, ఆర్‌యూబీల నిర్మాణం చేపట్టండి. రద్దయిన రైళ్లు, స్లీపర్ కోచ్‌లు పునరుద్ధరించాలి.రైల్వే స్థలాలపై కొర్రీలు వద్దు..రోడ్ల విస్తరణకు సహకరించాలి.కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.రైల్ నిలయంలో రైల్వే ఉన్నతాధికారులతో కూనంనేని భేటీ. కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని దీర్ఘకాలిక రైల్వే సమస్యలను తక్షణమే పరిష్కరించి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో బుధవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ, జీఎం సెక్రటరీ మల్లాది శ్రీనివాస్‌లను ఆయన కలిసి పలు సమస్యలపై అందించిన లేఖలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ మున్సిపల్ రహదారిని డబుల్ రోడ్డుగా విస్తరించేందుకు 22 అడుగుల రైల్వే స్థలాన్ని కేటాయించాలని కోరారు. బూడిదగడ్డ, రైటర్ బస్తీ, రామవరం–గరిమెళ్లపాడులలో ఆర్‌యూబీలు, లెవల్ క్రాసింగ్‌లు నిర్మించాలని, సర్వారంలో రైతుల కోసం అండర్‌పాస్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. హేమచంద్రాపురం బైపాస్‌లో కొత్త ఆర్‌వోబీతో పాటు సింగరేణి మెయిన్ ఆసుపత్రి వద్ద ఉన్న పాత ఆర్‌వోబీని విస్తరించాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో రద్దయిన మణుగూరు–కాజీపేట, భద్రాచలం రోడ్–డోర్నకల్, బెల్గాం–మణుగూరు రైళ్లను వెంటనే పునరుద్ధరించాలన్నారు. కాకతీయ ఫాస్ట్ ప్యాసింజర్‌లో స్లీపర్ బోగీలను పునరుద్ధరించడంతో పాటు తిరుపతికి నేరుగా వారాంతపు రైలు నడపాలని విజ్ఞప్తి చేశారు. భద్రాచలం రోడ్ స్టేషన్‌ను ‘కొత్తగూడెం రైల్వే స్టేషన్’గా పేరు మార్చాలని, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరగా రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారని కూనంనేని తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ