తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసులు, టీజీఎస్పీ పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కొత్తగూడెం రైల్వే స్టేషన్ సమీపం నుంచి పాత డిపో, పోస్ట్ ఆఫీస్ సర్కిల్ మీదుగా కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు, వారి సేవలను ప్రజలకు తెలియజేయడం, పోలీసుల సేవలు మరియు త్యాగాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. దేశం, సమాజం, ప్రజల రక్షణ కోసం అమరవీరులు చేసిన త్యాగాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని, పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరారు. పోలీసులకు, ప్రజలకు మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ, టీజీఎస్పీ అసిస్టెంట్ కమాండెంట్లు రామకృష్ణారెడ్డి, రంజిత్ కుమార్, సీఐలు వెంకటేశ్వర్లు, ఇంద్రసేనారెడ్డి, జితేందర్, ఆర్ఐలు సుధాకర్, కృష్ణారావు, జి.వి. రామారావు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ