తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై పతకాలతో మెరవాలి: మంత్రి పొంగులేటి.అశ్వారావుపేట మినీ స్టేడియాన్ని మణిహారంగా తీర్చిదిద్దుతాం. క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ, అన్ని విధాలా ప్రోత్సాహం.విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత శిఖరాలకు చేరాలి. గిరిజన ప్రాంతాల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం కృషి.33 జిల్లాల బాలికల కబడ్డీ పోటీలకు అశ్వారావుపేట వేదిక. రూ.23.50 కోట్లతో చేపట్టిన రహదారుల అభివృద్ధి పనుల ప్రారంభం. తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి పతకాలు సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని క్రీడాకారులకు సూచించారు. శనివారం ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురామరెడ్డి, అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీవో రాహుల్ తో కలిసి అశ్వారావుపేట పట్టణంలో రూ.23.50 కోట్ల వ్యయంతో చేపట్టిన రహదారుల అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు, మినీ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్-20 బాలికల కబడ్డీ పోటీలను మంత్రి ప్రారంభించారు.అశ్వారావుపేట పట్టణంలో రహదారుల అభివృద్ధి పనుల్లో భాగంగా ఖమ్మం–దేవరపల్లి రహదారిలో 119/0 కి.మీ. నుంచి 121/0 కి.మీ. వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను మంత్రి బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ పనులతో పాటు సీసీ డివైడర్లు, సీసీ డ్రైన్ల నిర్మాణం,అదేవిధంగా అశ్వారావుపేట–బూర్గంపాడు రహదారిలో 0/0 కి.మీ. నుంచి 1/5 కి.మీ. వరకు రెండు వరుసల రహదారిని నాలుగు వరుసల రహదారిగా విస్తరించి, పటిష్టపరిచే పనులను ప్రారంభించి, అనంతరం రహదారిపై ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను మంత్రి పరిశీలించారు.అనంతరం అశ్వారావుపేట మినీ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్-20 బాలికల కబడ్డీ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారిణులు, మహిళలు బతుకమ్మలతో అశ్వారావుపేట ప్రధాన కూడలి నుంచి క్రీడా ప్రాంగణం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సాగిన ర్యాలీతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. క్రీడా ప్రాంగణానికి చేరుకున్న అనంతరం మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, రిబ్బన్ కట్ చేసి కబడ్డీ పోటీలను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారిణులు, మహిళలతో కలిసి బతుకమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, వారితో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ , దసరా, నవరాత్రులు, బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అశ్వారావుపేట వంటి గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు క్రీడలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు . ఐదు ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నిర్మించిన అశ్వారావుపేట మినీ స్టేడియాన్ని భవిష్యత్తులో పట్టణానికి మణిహారంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి బాలికల కబడ్డీ జట్లు ఈ పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. చిన్న మున్సిపాలిటీ అయినప్పటికీ క్రీడాకారిణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతి, ఇతర సదుపాయాలు కల్పించిన నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సహకరించిన దాతలను అభినందించారు. వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేసిన అనుభవంతో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్న శాసనసభ్యులు జారే ఆదినారాయణను అభినందించారు.క్రీడల్లో గెలుపోటములు సహజమని, ప్రతి క్రీడాకారిణి క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొని ప్రతిభను చాటాలని మంత్రి సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారని, వాటిని నెరవేర్చేలా చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం క్రీడారంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు సాధించేలా ప్రభుత్వం క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ, అవసరమైన సదుపాయాలు, ప్రోత్సాహం అందిస్తుందని స్పష్టం చేశారు. రాబోయే ఐదారు సంవత్సరాల్లో అంతర్జాతీయ క్రీడా వేదికలపై తెలంగాణ క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురామిరెడ్డి మాట్లాడుతూ , రాష్ట్రస్థాయి క్రీడా పోటీల నిర్వహణకు ఎంతో ప్రణాళిక, కృషి అవసరమని అన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి క్రీడాకారులను అశ్వారావుపేట వంటి మారుమూల ప్రాంతానికి తీసుకువచ్చి పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు . కబడ్డీ గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రాచుర్యం పొందిన క్రీడ అని, ప్రో కబడ్డీ లీగ్ వంటి వేదికల ద్వారా దేశవ్యాప్తంగా ఈ క్రీడకు మరింత గుర్తింపు లభిస్తోందని తెలిపారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని ముందుకు సాగాలని సూచించారు.అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ మాట్లాడుతూ , రాష్ట్రవ్యాప్తంగా క్రీడాకారులు ఆసక్తిగా ఎదురుచూసే రాష్ట్రస్థాయి పోటీలను గిరిజన ప్రాంతమైన అశ్వారావుపేటలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ ప్రాంతం నుంచి మరింత మంది క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలనే లక్ష్యంతో పోటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వ్యాయామ ఉపాధ్యాయుడిగా గతంలో అనేక క్రీడా కార్యక్రమాలు నిర్వహించిన అనుభవం తనకు ఉందని, ప్రతిభావంతులైన క్రీడాకారులకు తగిన అవకాశాలు కల్పించాలన్న సంకల్పంతో ఈ పోటీలకు శ్రీకారం చుట్టినట్లు వివరించారు. క్రీడా పోటీల నిర్వహణకు సహకరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, కార్యకర్తలకు, క్రీడా నిర్వాహకులకు, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ , 33 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారిణులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల నిర్వహణ జిల్లాలో క్రీడా కార్యకలాపాలకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని అన్నారు . జిల్లాలో క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు ఆర్చరీ, షూటింగ్ వంటి విభాగాల్లో క్రీడా సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. వేసవి శిక్షణ శిబిరాల ద్వారా క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ అందించడంతో పాటు, వివిధ క్రీడా పోటీలను నిర్వహిస్తూ ప్రతిభావంతులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. క్రీడాకారిణులు పోటీల్లో తమ అత్యుత్తమ ప్రతిభను కనబరచాలని ఆకాంక్షించారు.జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ , వివిధ జిల్లాల నుంచి అశ్వారావుపేటకు వచ్చి పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారిణులకు స్వాగతం పలికారు. గెలుపోటముల కంటే క్రీడల్లో పాల్గొనడం, కష్టపడడం, పోటీతత్వంతో ముందుకు సాగడం ముఖ్యమని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారిణులను చూసి స్థానిక గిరిజన యువత స్ఫూర్తి పొంది క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని ఆకాంక్షించారు. పోటీల నిర్వహణ విజయవంతం కావడానికి పోలీసు శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఐటీడీఏ పీఓ రాహుల్ మాట్లాడుతూ , కబడ్డీ క్రీడకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉందన్నారు. ప్రో కబడ్డీ లీగ్ ద్వారా మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులకు కూడా తమ ప్రతిభను చాటుకునే అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు . భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గిరిజన యువకుడు తోడెం ప్రసాద్ స్థానిక గిరిజన పాఠశాలల్లో చదువుకొని ప్రో కబడ్డీ స్థాయికి ఎదగడం జిల్లాలోని యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారిణులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ప్రతిభను నిరూపించుకోవాలని కోరారు. అనంతరం మంత్రి కబడ్డీ పోటీలను ప్రారంభించి వీక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, మున్సిపల్ కమిషనర్ దిలీప్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, క్రీడా నిర్వాహకులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారిణులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ