Monday, 02 November 2026 07:00:18 PM
# పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్. # బస్సు కండక్టర్‌పై దాడి దురదృష్టకరం. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి.కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద నీటి నిల్వ పెంపునకు తక్షణ చర్యలు చేపట్టాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Date : 19 October 2026 01:30 PM Views : 287

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మూడు జిల్లాల తాగునీటి అవసరాల కోసం నీటిని పొదుపుగా వినియోగించాలి. సీతమ్మసాగర్ ప్రాజెక్టు పనులు నవంబర్ నుంచి ప్రారంభించేలా సన్నద్ధం కావాలి.నీటి లభ్యతను బట్టి పంటలు సాగు చేయాలి.. రైతులు నష్టపోవద్దు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలం, అమ్మగారిపల్లి గ్రామ పరిధిలోని దుమ్ముగూడెం ఆనకట్ట ను రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం పినపాక శాసనసభ్యులు, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. రానున్న వేసవిలో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆనకట్ట వద్ద నీటి నిల్వను పెంచేందుకు చేపట్టాల్సిన తక్షణ చర్యలను అధికారులతో సమీక్షించారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ , దుమ్ముగూడెం ఆనకట్ట పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 0.8 టీఎంసీలు కాగా, ప్రస్తుతం సుమారు 0.5 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. గోదావరి నదిలో నీటిని నిల్వ చేసుకునేందుకు అనుకూలమైన పరిస్థితులు పరిమితంగా ఉన్న నేపథ్యంలో, అందుబాటులో ఉన్న నీటిని వృథా కాకుండా నిల్వ చేసుకోవడం అత్యంత ముఖ్యమన్నారు. దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి మూడు జిల్లాలకు తాగునీరు అందించాల్సి ఉన్నందున, రానున్న నెలల్లో తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులకు కారణమవుతున్న సూపర్ ఎల్‌నినో భూతం ప్రభావంతో రానున్న కాలంలో తీవ్రంగా ఉండే అవకాశం ఉందని మంత్రి తెలిపారు . పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని, దక్షిణ భారతదేశంలో వర్షపాతంపై కూడా ప్రభావం పడుతుంది అని తెలిపారు. ఇప్పటికే ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రానున్న వేసవిలో నీటి లభ్యతపై ఆందోళన నెలకొందన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ జలవనరులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని స్పష్టం చేశారు.సూపర్ ఎల్‌నినో ప్రభావంతో రానున్న వేసవిలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని, దీంతో విద్యుత్ వినియోగం, డిమాండ్ కూడా పెరిగి విద్యుత్ కొరత ఏర్పడే పరిస్థితులు తలెత్తవచ్చని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని అన్నారు . రానున్న వేసవిలో విద్యుత్ కొరత తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని, వాతావరణ పరిస్థితులను ముందుగానే అంచనా వేసుకుని నీరు, విద్యుత్ వనరుల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద సుమారు ఒక మీటరు ఎత్తు వరకు ఇసుక బస్తాలను ఏర్పాటు చేసి నీటిని నిల్వ చేసుకునే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి సూచించినట్లు తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులు వెంటనే పనులు ప్రారంభించాలని, విజయదశమి పండుగ రోజైనా పనులకు ఆటంకం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. ఇసుక బస్తాల ఏర్పాటు ద్వారా సాధ్యమైనంత ఎక్కువ నీటిని నిల్వ చేసుకునేలా ఇంజినీరింగ్ అధికారులు సాంకేతిక అంశాలను పరిశీలించి, పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. నీటి ప్రవాహం తగ్గకముందే పనులు పూర్తి చేసి నీటిని నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ చర్యల ద్వారా ఒక టీఎంసీ కంటే ఎక్కువ నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటే, రానున్న నెలల్లో మరింత కాలం తాగునీటి అవసరాలను తీర్చవచ్చని తెలిపారు.ఆనకట్ట వద్ద నీటి నిల్వ పెంపు చర్యలతో పాటు నీటి వినియోగాన్ని కూడా నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి అధికారులకు సూచించారు. సమీపంలోని ప్రైవేటు జలవిద్యుత్ కేంద్రానికి నీటి వినియోగం విషయంలో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆనకట్టలో తగినంత నీటి నిల్వ ఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. తాగునీటి అవసరాలకు సరిపడా నీరు నిల్వ ఉన్నప్పుడు, అదనంగా ప్రవహించే మిగులు నీటిని మాత్రమే ఇతర అవసరాలకు వినియోగించేలా సంబంధిత అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు. తాగునీటి అవసరాలకు సరిపడా నీరు అందుబాటులో లేని పరిస్థితుల్లో ఇతర అవసరాలకు నీటి వినియోగాన్ని నియంత్రించాలని స్పష్టం చేశారు.సీతమ్మసాగర్ ప్రాజెక్టు నిర్మాణంపై మంత్రి మాట్లాడుతూ, వివిధ అనుమతులు, న్యాయపరమైన అడ్డంకుల కారణంగా గత ఐదేళ్లుగా ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని తెలిపారు. ప్రాజెక్టుకు అవసరమైన అనుమతుల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోందని అన్నారు . ఇటీవల సుప్రీంకోర్టు ద్వారా సంబంధిత న్యాయపరమైన అంశాల్లో పురోగతి సాధించామని, ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అనుమతులు ఈ నెలలో లభించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు అనుమతులు లభించిన వెంటనే పనులు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నిర్మాణానికి అవసరమైన యంత్రాలు, సామగ్రి, సిబ్బంది, ఇతర వనరుల సమీకరణపై ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత నిర్మాణ సంస్థకు సూచించారు. నవంబర్ నుంచి ప్రాజెక్టు పనులు ప్రారంభించేలా జిల్లా యంత్రాంగం, నీటిపారుదల శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ప్రాజెక్టు పనుల ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసుకోవడం ద్వారా అనుమతులు వచ్చిన వెంటనే పనులు చేపట్టేందుకు వీలవుతుందని అన్నారు .రైతులు ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల సాగుపై నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. పంటల సాగుకు ఎకరానికి లక్ష నుంచి రెండు, మూడు లక్షల రూపాయల వరకు పెట్టుబడి అవసరమవుతున్న నేపథ్యంలో, పంట చేతికొచ్చే సమయంలో నీరు, విద్యుత్, భూగర్భ జలాల కొరత ఏర్పడితే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల సాగుకు ముందే నీటి లభ్యత, విద్యుత్ సరఫరా, భూగర్భ జలాల పరిస్థితులను అంచనా వేసుకుని పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.తక్కువ వ్యవధిలో దిగుబడి, ఆదాయం వచ్చే కూరగాయలు, పప్పుదినుసులు వంటి పంటలను అందుబాటులో ఉన్న నీటి వనరులకు అనుగుణంగా సాగు చేయాలని మంత్రి సూచించారు. ఒకటి లేదా రెండు తడులతో పంట చేతికి వచ్చే అవకాశాలను పరిశీలించాలని, అధిక నీరు అవసరమయ్యే పంటల సాగు విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. నీటి లభ్యతపై స్పష్టత లేకుండా అధిక పెట్టుబడులతో పంటలు సాగుచేసి నష్టపోవడం కంటే, అందుబాటులో ఉన్న వనరులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవడం మంచిదని అన్నారు . వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించి, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపికపై సూచనలు అందించాలని ఆదేశించారు .ప్రజలు కూడా తాగునీటిని పొదుపుగా వినియోగించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి వనరులను జాగ్రత్తగా కాపాడుకోవడంతో పాటు, భవిష్యత్తులో ఎదురయ్యే నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. జిల్లా యంత్రాంగం, నీటిపారుదల శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద నీటి నిల్వ పెంపు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు,సంబంధిత శాఖల అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :