తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం సహించేది లేదు: కలెక్టర్ అంకిత్. గుండాల ఏకలవ్య పాఠశాలలో లోపాలపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి.. ప్రిన్సిపాల్‌కు మెమో, వంట మనిషిని తొలగించాలని ఆదేశం. మారుమూల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.. మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉంచాలి. భూ రీ సర్వే పనులు వేగవంతం చేయాలి.. రైతులకు ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ శుక్రవారం విస్తృతంగా పర్యటించి భూ రీ సర్వే పనులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ శాఖల పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.గుండాల రెవెన్యూ పరిధిలో జరుగుతున్న భూ రీ సర్వే పనులను పరిశీలించిన కలెక్టర్ సర్వే పురోగతిని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మొత్తం 10,390 ఎకరాల విస్తీర్ణంలో 6,694 ఎకరాలు అటవీ భూములుగా ఉన్నాయని, అటవీ శాఖ గెజిట్ ప్రకారం నిర్దేశించిన హద్దులు, ఎన్‌క్లోజర్ లేయర్ల ఆధారంగా మిగిలిన భూముల్లో సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు సుమారు 950 ఎకరాల్లో సర్వే పూర్తికాగా, అందులో 561 ఎకరాల ఎంజాయ్‌మెంట్ సర్వే నిర్వహించినట్లు సిబ్బంది వివరించారు.రైతుల సమక్షంలోనే భూముల హద్దులను నిర్ధారించాలని, వారి పేర్లు, సంతకాలు, ఆధార్, మొబైల్ వివరాలను ఫీల్డ్ రిజిస్టర్లలో తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. పహాణీ, పట్టాదారు పాస్ పుస్తకాల వివరాలతో పాటు ప్రస్తుతం సాగు చేస్తున్న రైతుల వివరాలను కూడా నమోదు చేయాలన్నారు. అటవీ, అసైన్డ్, రెవెన్యూ భూములకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, రైతుల అభ్యంతరాలను సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కరించాలని తెలిపారు. సర్వే పూర్తయిన అనంతరం హద్దు రాళ్లు ఏర్పాటు చేయాలని, భూ రీ సర్వే ప్రక్రియను నవంబర్ 15వ తేదీలోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా డీజీపీఎస్ (DGPS) పరికరాల పనితీరును కూడా పరిశీలించారు.అనంతరం గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అక్కడ అందిస్తున్న వైద్య సేవలు, రక్త పరీక్షలు, మందుల నిల్వలు, వైద్య పరికరాల లభ్యతపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. మందుల గదిని పరిశీలించగా అత్యవసర వైద్య అవసరాలకు ఉపయోగించే సిరంజీలు అందుబాటులో లేకపోవడాన్ని గుర్తించి కారణాలను ప్రశ్నించారు. ఇంటర్నెట్ సమస్యల కారణంగా మందులు, వైద్య సామగ్రి సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇప్పటికే ఇండెంట్ పెట్టామని వైద్యాధికారులు వివరించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సిరంజీలు, అవసరమైన మందులు, వైద్య పరికరాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు.అనంతరం సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించి సమయపాలన పాటించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా ప్రతి రోగికి సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఇన్‌పేషెంట్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యం, మందులు, భోజన సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. మారుమూల ప్రాంత ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు.అనంతరం గుండాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ విద్యార్థులకు అందిస్తున్న విద్యా బోధన, మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, భోజన సదుపాయాలను పరిశీలించారు. తరగతి గదుల్లో విద్యార్థులు లేకపోవడాన్ని గమనించి, తరగతుల సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఏమిటని ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించారు. విద్యార్థుల విద్యాభ్యాసానికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, సాంస్కృతిక కార్యక్రమాలను సెలవు రోజుల్లో నిర్వహించుకోవాలని సూచించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా తరగతులకు హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు.పాఠశాల మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటంపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వంటశాల, స్టోర్ రూమ్‌ను పరిశీలించగా బంగాళాదుంపలు కుళ్లిపోయి ఉండటం, పంచదారలో చీమలు పట్టి ఉండటాన్ని గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన వంట మనిషిని విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు. విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్ సాంబార్, రసం పలుచగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆరోజు ప్రభుత్వ మెనూ ప్రకారం బిర్యానీ వడ్డించాల్సి ఉండగా, అందుకు అనుగుణంగా భోజనం సిద్ధం చేయకపోవడాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా అమలు చేయాలని, విద్యార్థులకు ప్రతిరోజూ నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని స్పష్టం చేశారు.పాఠశాలలో విద్యార్థుల హాజరు, బోధన, పారిశుద్ధ్యం, భోజన నాణ్యత, ఆహార పదార్థాల నిల్వలో గుర్తించిన లోపాలపై ప్రిన్సిపాల్‌కు మెమో జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, పరిశుభ్రమైన వాతావరణం, మెరుగైన వసతులు, పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ పర్యటనలో సర్పంచ్ రాధా, తహసీల్దార్ సంగీత, ఎంపీడీవో బాలరాజు, ఎంఈఓ పార్వతి, ఎంపీవో త్రిలోక్, సర్వేయర్ శివకృష్ణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ