తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పెండింగ్ నోటీసుల డెలివరీని తక్షణమే పూర్తి చేయాలి బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి అవసరమైన పత్రాలను సేకరించాలి జిల్లాలో ఎస్‌ఐఆర్-2026 ప్రక్రియలో పెండింగ్‌లో ఉన్న నోటీసుల డెలివరీ, పత్రాల సేకరణ, ఫామ్-6, 7, 8 దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని ఎన్నికల అధికారులు, ఈఆర్‌ఓలు, తహసీల్దార్లతో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 5,858 నోటీసులు సర్వ్ చేయాల్సి ఉండగా, ఐదు రోజులకు పైగా పెండింగ్‌లో ఉన్న 132 నోటీసులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. నోటీసుల డెలివరీలో భద్రాచలం, పాల్వంచ, మణుగూరు, పినపాక, అశ్వారావుపేట ప్రాంతాల్లో పెండెన్సీపై కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్షించారు. భద్రాచలంలో 1,260, పాల్వంచలో 872, మణుగూరులో 716, పినపాక పరిధిలో 804, అశ్వారావుపేటలో 504 నోటీసులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు వివరించారు. భద్రాచలంలో పెండింగ్ సంఖ్య అధికంగా ఉన్నందున ప్రత్యేక దృష్టి సారించి నోటీసుల డెలివరీని వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి అవసరమైన పత్రాలను సేకరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నోటీసులు అందని ఓటర్లను క్షేత్రస్థాయిలో పునఃసందర్శించి, అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. పత్రాలు అందుబాటులో లేని ఓటర్లకు అవసరమైన మార్గదర్శకత్వం అందించాలని, పేదలు, నిరక్షరాస్యులు, బలహీన వర్గాలకు చెందిన అర్హులైన ఓటర్లు ప్రక్రియలో నష్టపోకుండా ప్రత్యేక సహకారం అందించాలని ఆదేశించారు. అవసరమైన చోట హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి ప్రజలకు సహాయం అందించాలని తెలిపారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఓటర్లను అనవసరంగా కార్యాలయాలకు పిలిపించకుండా, బీఎల్‌ఓలు క్షేత్రస్థాయిలోనే అవసరమైన వివరాలు, పత్రాలను సేకరించాలని కలెక్టర్ సూచించారు. భౌతిక హియరింగ్స్ నిర్వహించకుండా ఎన్నికల సంఘం సూచించిన విధానాలను మాత్రమే అనుసరించాలని, అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన ప్రక్రియను ఆన్‌లైన్ విధానంలో చేపట్టాలని తెలిపారు. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ సంబంధిత ఓటర్ అందుబాటులోకి రాని సందర్భాల్లో బీఎల్‌ఓలు చేసిన ప్రయత్నాలను రికార్డు చేయాలని, నిబంధనల మేరకు తదుపరి చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. పలుమార్లు ప్రయత్నించినా ఓటర్‌ను గుర్తించడం లేదా సంప్రదించడం సాధ్యం కాని సందర్భాల్లో నిబంధనల ప్రకారం స్పీకింగ్ ఆర్డర్ జారీ చేసి కేసులను పరిష్కరించాలని సూచించారు. ఫామ్-6, ఫామ్-7, ఫామ్-8 దరఖాస్తుల పెండెన్సీని కూడా ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. 15 రోజులకు పైగా పెండింగ్‌లో ఉన్న 140 దరఖాస్తులు, 30 రోజులకు పైగా పెండింగ్‌లో ఉన్న 77 దరఖాస్తులు, 45 రోజులకు పైగా పెండింగ్‌లో ఉన్న 332 దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఫామ్-6 దరఖాస్తులకు సంబంధించిన డిక్లరేషన్‌ను తప్పనిసరిగా సేకరించి, పెండింగ్ లేకుండా చూడాలని తెలిపారు. అశ్వారావుపేట పరిధిలో ఫామ్-6, 7, 8లకు సంబంధించి 1,910 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు వివరించగా, వాటిని నిర్ణీత సమయంలో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని నియోజకవర్గాల్లో ఫారాల పెండెన్సీపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టి, ఎక్కువ కాలంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. బల్క్‌గా సమర్పించే ఫామ్-7 దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవసరమైన ధృవీకరణ అనంతరం మాత్రమే తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో సమర్పించే దరఖాస్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అర్హులైన ఓటర్ల హక్కులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి దరఖాస్తును నిబంధనల మేరకు పరిశీలించాలని స్పష్టం చేశారు. సమీక్షలో అధికారులు తమ పరిధిలోని పురోగతిని కలెక్టర్‌కు వివరించారు. భద్రాచలం నియోజకవర్గంలో నోటీసుల డెలివరీ సుమారు 95 శాతం, కొత్తగూడెం పరిధిలో 97 శాతం, అశ్వారావుపేటలో 96.2 శాతం పూర్తయినట్లు తెలిపారు. మిగిలిన నోటీసుల డెలివరీని కూడా ప్రత్యేక బృందాలతో వేగవంతం చేసి పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ప్రతి దశను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, నోటీసుల డెలివరీ, పత్రాల సేకరణ, ఫామ్-6, 7, 8 దరఖాస్తుల పరిష్కారంపై రోజువారీ పురోగతిని సమీక్షించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. ఎన్నికల సంఘం తదుపరి సమీక్షకు ముందే పెండింగ్ అంశాల్లో గణనీయమైన పురోగతి సాధించాలని, అధికారులు సమన్వయంతో పనిచేసి అర్హులైన ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎస్‌ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల మేరకు పారదర్శకంగా, సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ