తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు గురువారం నాడు కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆన్‌లైన్ ఓపెన్ హౌస్, ఓపెన్ హౌస్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులకు పోలీస్ శాఖలోని వివిధ విభాగాల పనితీరు, విధులు, వాటి ప్రాధాన్యత గురించి అధికారులు క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా షీ టీమ్స్ మహిళలు, బాలికల భద్రత కోసం చేపట్టే చర్యలు, వేధింపుల నివారణ, ఫిర్యాదుల స్వీకరణ, బాధితులకు అందించే సహాయం గురించి వివరించారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం మానవ అక్రమ రవాణాను అరికట్టడం, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవడంలో నిర్వహించే పాత్రను వివరించారు.భరోసా కేంద్రం ద్వారా మహిళలు, బాలికలు, చిన్నారులపై జరిగే నేరాలకు సంబంధించి బాధితులకు అందించే సహాయం, కౌన్సెలింగ్, అవసరమైన సహాయక సేవల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ మహిళల భద్రత కోసం చేపట్టే కార్యక్రమాలు, మహిళలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి తీసుకునే చర్యలను వివరించారు.ఫింగర్ ప్రింట్ విభాగం, క్లూస్ టీమ్ నేరస్థలాల్లో లభించే ఆధారాలను సేకరించడం, వేలిముద్రల ఆధారంగా నేర పరిశోధనలో కీలక సమాచారాన్ని గుర్తించడం, శాస్త్రీయ ఆధారాల ద్వారా కేసుల దర్యాప్తులో సహకరించే విధానాన్ని వివరించారు. అదేవిధంగా బాంబ్ డిస్పోజల్ టీమ్ వారు ఉపయోగించే పరికరాలు, ప్రమాదాలను నివారించేందుకు తీసుకునే జాగ్రత్తలు, డాగ్ స్క్వాడ్ సహాయంతో నేరాల పరిశోధన వంటి పలు అంశాలను వివరించారు. కమ్యూనికేషన్ విభాగం సమాచార వ్యవస్థ నిర్వహణలో పోషించే పాత్రను, ఉపయోగించే పరికరాల గురించి విద్యార్థులకు తెలియజేశారు.ఓపెన్ హౌస్ కార్యక్రమం ద్వారా పోలీస్ శాఖలో వినియోగించే పరికరాలు, నేర పరిశోధనలో ఉపయోగించే సాంకేతిక విధానాలు, భద్రతా చర్యల గురించి ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కల్పించారు.విద్యార్థులు పోలీస్ శాఖ పనితీరును దగ్గరగా తెలుసుకోవడంతో పాటు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని, మహిళలు మరియు బాలల భద్రతకు సంబంధించిన అంశాలపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ, సిఐలు శ్రీనివాస్, రాము, వెంకటేశ్వర్లు, ఇంద్రసేనారెడ్డి, జితేందర్, యాసీన్, ఎస్సైలు శ్రీనివాస్, అరుణ, రమాదేవి, పోలీస్ అధికారులు, సిబ్బంది, సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ