తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : డిసెంబర్ నాటికి వంద పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలి తాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ నీటిని పొదుపుగా వినియోగించాలి వరి సాగును తగ్గించి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఇల్లందు పట్టణంలో జిల్లా కలెక్టర్ అంకిత్ శుక్రవారం విస్తృతంగా క్షేత్రస్థాయి పరిశీలనలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.37.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు, ఇల్లందు చెరువులో నీటి నిల్వలు, సుందిమళ్ల టీజీడబ్ల్యూఆర్ఎస్ పాఠశాల, కళాశాలలో విద్యార్థులకు అందుతున్న విద్య, వసతి, భోజనం, మౌలిక వసతులను పరిశీలించారు. సంబంధిత అధికారులతో ఆయా అంశాలపై సమీక్షించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఇల్లందు పట్టణంలో రూ.37.50 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటివరకు పూర్తయిన పనులు, ప్రస్తుతం కొనసాగుతున్న పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి నిర్మాణ మ్యాప్‌ను పరిశీలిస్తూ ఇన్‌పేషెంట్, ఔట్‌పేషెంట్ విభాగాలు, ఐసీయూ, ఎమర్జెన్సీ విభాగం, వార్డులు, వెయిటింగ్ హాల్, మరుగుదొడ్లు తదితర సదుపాయాల ఏర్పాటుపై అధికారులతో చర్చించారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాలను సౌకర్యవంతంగా, ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. నూతన వంద పడకల ఆసుపత్రి అందుబాటులోకి వస్తే ఇల్లందు పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. అత్యవసర వైద్య సేవలు సకాలంలో అందేలా ఎమర్జెన్సీ, ఐసీయూ తదితర విభాగాలను అవసరమైన సౌకర్యాలతో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డిసెంబర్ నాటికి ఆసుపత్రి నిర్మాణ పనులను పూర్తిస్థాయిలో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించుకొని పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నిర్మాణ సంస్థ, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించరాదని, ఉపయోగించే నిర్మాణ సామగ్రి నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా నిర్దేశిత ప్రమాణాల ప్రకారం నిర్మాణ పనులు చేపట్టాలని స్పష్టం చేశారు.
ఇదే క్రమంలో ఇల్లందు చెరువును జిల్లా కలెక్టర్ పరిశీలించారు. చెరువులోని ప్రస్తుత నీటిమట్టం, నీటి నిల్వ, పూర్తి స్థాయి నీటిమట్టం, గరిష్ట నీటిమట్టం, రోజువారీ తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్న నీటి పరిమాణం, నీటి డిశ్చార్జ్ తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెరువు పూర్తి స్థాయి నీటిమట్టం 219.150 మీటర్లు, గరిష్ట నీటిమట్టం 219.750 మీటర్లు కాగా, పూర్తి నిల్వ సామర్థ్యం 45 ఎంసీఎఫ్‌టీ, నీటి విస్తీర్ణం 136.23 ఎకరాలు, క్యాచ్‌మెంట్ ఏరియా 26 చదరపు కిలోమీటర్లుగా ఉందని అధికారులు తెలిపారు. పాఠశాలలోని లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ తదితర సదుపాయాలను విద్యార్థులు సక్రమంగా వినియోగిస్తున్నారా అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల్లో పఠన అలవాట్లు, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందేలా అందుబాటులో ఉన్న సదుపాయాలను సమర్థవంతంగా వినియోగించేలా చూడాలని సూచించారు. పాఠశాల భవనంలో వర్షాకాలంలో లీకేజీ సమస్యతో పాటు భోజనశాలలో కూడా లీకేజీలు ఉన్నాయని ప్రధానోపాధ్యాయులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సమస్యల పరిష్కారానికి అవసరమైన ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేసి పంపించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరమ్మతు పనులను ప్రాధాన్యతతో చేపట్టాలని సూచించారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలనల్లో కలెక్టర్ వెంట తహసీల్దార్ ఖాసీం, ఎంపీడీవో ధన్సింగ్, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, ప్రధానోపాధ్యాయులు, ఇంజనీరింగ్ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ