తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అభ్యర్థులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్న ఎన్నికల కమీషన్ జాతర వేళ - ఎన్నికలు ఎలా...??? తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికల విషయంలో ఎన్నికల సంఘం నిర్వహించిన తీరు సరైనదిగా లేదని జైభీమ్ రావ్ భారత్ పార్టీ(జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ ఆరోపించారు.బుధవారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ కుంభమేళాగా చెప్పుకునే సమ్మక్క సారలమ్మ జాతరలో తెలంగాణ ప్రజలు భక్తిశ్రద్ధలతో పాల్గొంటుండగా కార్పొరేషన్,మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి కనీసం సమయం ఇవ్వకుండానే ఉరుకులు పరుగులు పెట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమీషన్ దుందుడుకు స్వభావంతో వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. ఒక వైపు పండగ ఉత్సవాలు,మరోవైపు ఎన్నికలతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారని,ముఖ్యంగా కొత్తగూడెం మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మార్చే ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో,డివిజన్ల విభజనపై సరైన స్పష్టత లేకపోవడం వల్ల పోటీ చేసే అభ్యర్థులలో,ఓటర్లలో గందరగోళం నెలకొందని అన్నారు.కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని ఓటర్లంతా కార్పొరేషన్ అవుతుందా? లేక మున్సిపాలిటీగానే కొనసాగుతుందా? అనే సందిగ్ధంలో ఉండగానే నోటిఫికేషన్ రావడం విమర్శలకు తావిస్తోందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలనుకున్నప్పుడు ప్రజలు ఆలోచించుకునే విధంగా అభ్యర్థులు పోటీ చేసే విధంగా కొంత సమయం ఇవ్వాలని అన్నారు.ఈ విషయంలో ఎన్నికల కమీషన్ ఒక్కసారి పునరాలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు.ప్రజాప్రతినిధులు,అభ్యర్థులకు తగిన సమయం ఇవ్వకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్నికల నిర్వహణలో పారదర్శకతతో పాటు,స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని సమయోచిత నిర్ణయాలు తీసుకోవాలని ఎన్నికల కమీషనర్ ను కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ