తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సేవా దృక్పథంతో యువత ముందుకు రావాలి వర్షాల వేళ భద్రతపై అప్రమత్తంగా ఉండాలి మండపాల వద్ద విద్యుత్, పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టిపెట్టండి : కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు సమాజంలో భక్తిభావంతో పాటు సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ అత్యంత ముఖ్యమని, ఇది మన అందరి బాధ్యతని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బుధవారం కొత్తగూడెం పట్టణం, పరిసర ప్రాంతాల్లో ఉత్సవ కమిటీలు ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మండపాల వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని నిర్వాహకులకు, ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలుచోట్ల ఉత్సవ కమిటీలు ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను ఎమ్మెల్యే కూనంనేని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్సవాల నిర్వహణ ద్వారా ప్రజల మధ్య సద్భావన వెల్లివిరుస్తుందని, సంస్కృతిని కాపాడుతూ సేవా దృక్పథంతో సామాజిక కార్యక్రమాలు చేపట్టడంలో యువత, ఉత్సవ కమిటీల చొరవ అభినందనీయమని పేర్కొన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా కమిటీలు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మండపాలు, పరిసర ప్రాంతాల్లో ప్రజారోగ్యానికి భంగం కలగకుండా కార్పొరేషన్, గ్రామ పంచాయతీ అధికారులు నిరంతరం పారిశుధ్య పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. వర్షాల వల్ల విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌లు జరగకుండా విద్యుత్ శాఖ సిబ్బంది కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. కూనంనేని వెంట సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, కార్పొరేటర్ దాసరి శ్రీనివాస్, నాయకులు పల్లపోతు సాయి, పోరెడ్డి శ్రీనివాసరెడ్డి, లగడపాటి రమేష్, సానబోయిన రాజు, కె యస్వంత్, ఆంటోని, దాసరి రామారావు, పొన్నం అజయ్, భరత్, జేమ్స్, స్టాలిన్, రాజు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ