తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పెండింగ్ పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలి అదనపు నిధుల ప్రతిపాదనపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలి పుష్కర ఘాట్ల పొడవు, విస్తరణపై కలెక్టర్లతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలి గోదావరి పుష్కరాల నిర్వహణకు చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి, పెండింగ్ పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అధికారులను ఆదేశించారు. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావుతో కలిసి సోమవారం హైదరాబాద్ నుంచి గోదావరి నదీ తీర జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అంకిత్ ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరం నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుష్కరాల కోసం చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతి, టెండర్ల ప్రక్రియ, భూసేకరణ, నిధుల విడుదల, పుష్కర ఘాట్ల అభివృద్ధి తదితర అంశాలను సమీక్షించారు. రోడ్లు, భవనాల శాఖకు సంబంధించిన టెండర్ల మినహాయింపు ప్రక్రియను తక్షణమే పరిష్కరించాలని, భూసేకరణకు అవసరమైన నిధుల విడుదలపై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రటరీ సూచించారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన నీటిపారుదల పనులను ప్రారంభించాలని, దేవాదాయ శాఖ పరిధిలో ఇంకా ప్రారంభం కాని పనులను క్షేత్రస్థాయిలో చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీటిపారుదల పనులకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో నీటిమట్టాలు తగ్గిన అనంతరం పనులు చేపట్టాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ పరిధిలో నీటిమట్టాలు తగ్గిన తర్వాత సంబంధిత పనులను ప్రారంభించేందుకు వీలవుతుందని తెలిపారు. ఈ పనులను నవంబర్‌లో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. పుష్కర ఘాట్ల పొడవు, విస్తరణకు సంబంధించి కలెక్టర్లతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని శైలజ రామయ్యర్ సూచించారు. ఆయా జిల్లాల అవసరాలు, పనుల ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకొని ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఘాట్ల పనులపై నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. ఈ అంశంపై కలెక్టర్లతో చర్చించి శనివారం నాటికి తుది నిర్ణయానికి రావాలని సూచించారు. పుష్కరాల కోసం అదనంగా అవసరమైన నిధుల అంశంపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రటరీ సూచించారు. ఈ అంశంపై చర్చించాల్సిన అవసరాన్ని వివరిస్తూ ముందుగా క్యాబినెట్ సబ్‌కమిటీకి నోట్ పంపాలని తెలిపారు. అదే సమయంలో వివిధ పనులకు ప్రాధాన్యతలను ఖరారు చేసేందుకు కలెక్టర్లు తమ జిల్లాల పరిధిలో అత్యవసరంగా చేపట్టాల్సిన పనులను గుర్తించి ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. ఏయే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ పనులు అత్యవసరంగా చేపట్టాల్సిన అవసరం ఉందనే అంశాలపై కలెక్టర్లు పరస్పరం చర్చించుకోవాలని సూచించారు. కలెక్టర్లు సూచించిన ప్రాధాన్యతలపై క్యాబినెట్ సబ్‌కమిటీతో చర్చించిన అనంతరం తుది ప్రతిపాదనలను సమర్పించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. భద్రాచలంలో పుష్కర ఘాట్లకు, వైకుంఠధామానికి ప్రస్తుతం ఒకే మార్గం ఉన్నందున రద్దీ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా వైకుంఠధామానికి ప్రత్యేక మార్గం ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సమావేశంలో సూచించారు. పుష్కరాల సమయంలో అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు క్షతగాత్రులను తరలించేందుకు ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ స్పందిస్తూ, భద్రాచలంలో వైకుంఠధామానికి ప్రత్యేక మార్గం ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా వివిధ శాఖల పరిధిలోని పెండింగ్ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని, పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్ణీత గడువులో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. కలెక్టర్లు, ఇంజినీరింగ్ శాఖల ఉన్నతాధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ అత్యంత కీలకమైన పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ సునీత, ఇరిగేషన్ ఈఈ సయ్యద్ అహ్మద్ జానీ, పంచాయతీరాజ్ ఈఈ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ