తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కష్టజీవులైన కార్మిక కుటుంబాలకు ఎల్లప్పుడూ సిపిఐ, ఏఐటీయూసీ అండగా ఉంటాయని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా స్పష్టం చేశారు. కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్(జీజీహెచ్)లో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తూ ఇటీవల అకాల మృతిచెందిన ఏఐటీయూసీ సభ్యురాలు బడుగు లలిత సంతాప సభ సోమవారం రామవరంలోని ఆమె స్వగృహంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సాబీర్ పాషా, దివంగత లలిత చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికురాలిగా నిరంతరం సేవలందిస్తూ కార్మిక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న లలిత మరణం తీవ్ర విచారకరమని, ఆమె కుటుంబానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. లలిత భర్త బడుగు భాస్కర్ ఏఐటీయూసీ ఆటో వర్కర్స్ యూనియన్ పట్టణ నాయకుడిగా కార్మికుల పక్షాన నిలబడి సేవలందిస్తున్నారని గుర్తుచేస్తూ, వారి కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. నిరుపేద కార్మిక కుటుంబాలకు సంక్షేమ పథకాలు, ఉద్యోగ భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వీడాలని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య, కార్పొరేటర్ హిమాశ్రీ, నాయకులు రంగారావు, హరినాథ్, రాజేశ్వరరావు, బడుగు రమేష్, సాయిలు, ఉపేందర్, ఖయూమ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ