తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రానున్న దీపావళి పండుగ సందర్భంగా జిల్లాలో తాత్కాలిక బాణాసంచా విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అనుమతులు కోరే వారు, అవసరమైన ధ్రువపత్రాలతో కూడిన పూర్తి దరఖాస్తులను నవంబర్ 2వ తేదీలోపు సంబంధిత డీఎస్పీ కార్యాలయాల్లో సమర్పించాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ తెలిపారు. దరఖాస్తుతో పాటు అగ్నిమాపక శాఖ జారీ చేసిన నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (NOC), స్థల యజమాని లేదా సంబంధిత ప్రభుత్వ అధికారి నుంచి పొందిన అనుమతి పత్రం, జీఎస్‌టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, గతంలో లైసెన్స్ పొందినట్లయితే దాని ప్రతిని జతచేయాలని సూచించారు. అవసరమైన చోట్ల పక్క స్థలాల యజమానుల అనుమతి పత్రాలు, విక్రయ కేంద్రానికి సంబంధించిన బ్లూప్రింట్ (సైట్ ప్లాన్)ను కూడా సమర్పించాలని తెలిపారు.అదేవిధంగా, ప్రభుత్వ ఖజానాకు నిర్ణీత రుసుము చెల్లించినట్లు ధ్రువీకరించే బ్యాంకు చలాన్‌ను దరఖాస్తుతో పాటు జతచేయాలని పేర్కొన్నారు. సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా సంబంధిత డీఎస్పీ స్థాయి అధికారులు అనుమతులు జారీ చేస్తారని ఎస్పీ తెలిపారు. అనుమతులు లేకుండా బాణాసంచా విక్రయాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, వ్యాపారులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ