తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యానికి తావివ్వొద్దు ప్రజల నుంచి స్వీకరించే ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, డిఆర్ఓ పద్మావతి తో కలిసి ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. భూ సంబంధిత సమస్యలు, రెవెన్యూ అంశాలు, సంక్షేమ పథకాలు, ఉపాధి, పింఛన్లు, గృహాలు, మౌలిక వసతులు, సామాజిక భద్రత తదితర సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రజావాణి కార్యక్రమం ముఖ్యమైన వేదికగా నిలుస్తోందన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి దరఖాస్తును అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యానికి తావివ్వరాదని స్పష్టం చేశారు. తక్షణమే పరిష్కరించగల సమస్యలను ఎలాంటి ఆలస్యం లేకుండా పరిష్కరించాలని, క్లిష్టమైన సమస్యలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయంతో పనిచేస్తూ ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తుల పరిష్కార స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంతో పాటు మండల స్థాయిలోని ఎంపీడీవో కార్యాలయాల్లో కూడా ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు తమకు సమీపంలోని ఎంపీడీవో కార్యాలయంలో వినతులు సమర్పించి, స్థానిక స్థాయిలోనే సమస్యలకు పరిష్కారం పొందాలని సూచించారు. వినతులతో పాటు సంబంధిత ఆధార పత్రాలను సమర్పిస్తే సమస్యల పరిష్కారం మరింత వేగంగా జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు.
ప్రజావాణిలో వచ్చిన కొన్ని వినతులు గుండాల మండలం కాంచనపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని జగ్గు తండాకు చెందిన బానోత్ చాందిని తన భూమికి సంబంధించిన సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. సర్వే నంబర్ 31, ఖాతా నంబర్ 33లో ఉన్న భూమిని గతంలో సర్వేయర్ ద్వారా సర్వే చేయించి, చుట్టుపక్కల రైతుల సంతకాలు కూడా తీసుకున్నప్పటికీ ఇప్పటివరకు పట్టా మంజూరు కాలేదని తెలిపారు. తనకు పట్టా మంజూరు చేయించి న్యాయం చేయాలని కోరారు. ఈ దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యల నిమిత్తం తాసిల్దార్ కు ఎండార్స్ చేశారు. లక్ష్మీదేవిపల్లి మండలం పాత కారుకొండ గదిగుట్ట గ్రామపంచాయతీ పరిధికి చెందిన బట్టు సుభద్ర తనకు స్థానికతకు సంబంధించిన లోకల్ ఏరియా సర్టిఫికెట్‌ను సంబంధిత తహసీల్దార్ మంజూరు చేశారని తెలిపారు. ఇటీవల అంగన్‌వాడీ ఆయా పోస్టుకు దరఖాస్తు చేసుకోగా, విచారణ సమయంలో తాను స్థానికంగా ఉండడం లేదని, హైదరాబాద్‌లో నివసిస్తున్నట్లు గుర్తుతెలియని వ్యక్తులు అధికారులకు సమాచారం ఇచ్చారని తెలిపారు . ఈ విషయంపై సంబంధిత తహసీల్దార్ ద్వారా విచారణ జరిపించి తనకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరగా, కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం గుండాల తాసిల్దార్ కు ఎండార్స్ చేశారు. దుమ్ముగూడెం మండలానికి చెందిన బానోత్ భవిత గత ఆరు సంవత్సరాలుగా పర్ణశాలలోని నారచీరల ప్రాంతంలో కూల్‌డ్రింక్స్, బజ్జి, పకోడీల దుకాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత నెలలో గోదావరి వరదల సమయంలో తన దుకాణం నీట మునిగిపోవడంతో దుకాణాన్ని తొలగించానని, తిరిగి అదే ప్రాంతంలో దుకాణం ఏర్పాటు చేసుకునేందుకు వెళ్లగా మరొకరు అక్కడ దుకాణం ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. ఈ విషయాన్ని తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని, తన దుకాణం ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించి న్యాయం చెయ్యాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం దుమ్ముగూడెం తాసిల్దార్ కు ఎండార్స్ చేశారు. దమ్మపేట మండలం వడ్లగూడ గ్రామపంచాయతీకి చెందిన కుంజ సావిత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన పట్టాదారు పాస్‌బుక్‌లలో సర్వే నంబర్ 394/10/Aలో 4.2500 ఎకరాల భూమి ఉన్నట్లు తెలిపారు. సదరు భూమికి తెలంగాణ పట్టాదారు పాస్‌బుక్ జారీ చేయడంతో పాటు భూమి హద్దులను సర్వే చేయాలని కోరుతూ చేసిన దరఖాస్తు ను పరిశీలించి తగు చర్యలు నిమిత్తం దమ్మపేట తాసిల్దార్ కు ఎండార్స్ చేశారు. లక్ష్మీదేవిపల్లి మండలం కారుకొండ పంచాయతీకి చెందిన వాంకుండోత్ సునీత మాట్లాడుతూ, తన కుమారుడు చరిత్ మానస్ తమిళనాడు రాష్ట్రంలోని అమరావతి నగర్‌లో ఉన్న ఆల్ ఇండియా సైనిక్ స్కూల్‌లో చదువుతున్నట్లు తెలిపారు. తెలంగాణలో సైనిక్ స్కూల్ అందుబాటులో లేనందున ఎన్‌టీఏ నిర్వహించిన పరీక్షలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఎస్టీ కేటగిరీలో మొదటి ర్యాంక్ సాధించి తమిళనాడులోని సైనిక్ స్కూల్‌లో సీటు పొందినట్లు పేర్కొన్నారు. ప్రతి ఏడాది సుమారు రూ.2 లక్షల మేర ఫీజు చెల్లించాల్సి రావడంతో ఆర్థికంగా భారంగా మారిందని తెలిపారు. తన భర్త 2020లో ప్రమాదవశాత్తు మృతి చెందారని, తన కుమారుడి చదువుకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ