తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జాయింట్ సర్వేలను వేగవంతం చేసి స్పష్టమైన నివేదికలు సమర్పించాలి. పెండింగ్ భూ సర్వేలు, వివాదాలను గడువులోగా పరిష్కరించాలి. అభివృద్ధి ప్రాజెక్టులకు భూసేకరణలో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలి. CA భూములు, అటవీ భూముల మళ్లింపు ప్రతిపాదనలను వేగవంతం చేయాలి.జిల్లాలో అటవీ, రెవెన్యూ భూ సమస్యలు, వివిధ అభివృద్ధి పనులకు అవసరమైన భూసేకరణ, భూ సర్వేలు, అటవీ భూముల సరిహద్దుల నిర్ధారణ, పోడు భూములు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ అంకిత్ అధ్యక్షతన సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఐటీడీఏ పీఓ రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ విక్రం సింగ్,అటవీ శాఖ అధికారులు, తహసీల్దార్లు, సర్వేయర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.అటవీ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయంతో భూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. కార్యాలయాల మధ్య లేఖల మార్పిడికే పరిమితం కాకుండా సంబంధిత అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి రికార్డులు, వాస్తవ పరిస్థితులను పరిశీలించి సమస్యలకు పరిష్కారం చూపాలని సూచించారు. జాయింట్ సర్వేలను నిర్దిష్ట గడువులో పూర్తి చేసి స్పష్టమైన సమగ్ర నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.పాపకొల్లు గ్రామంలోని అటవీ, ప్రభుత్వ, పట్టా భూముల సరిహద్దులు, పాత రికార్డులకు సంబంధించిన భూ వివాదాన్ని సమావేశంలో సమీక్షించారు. పాత ఖాస్రా పహాణీ, రెవెన్యూ రికార్డులు, ప్రస్తుత రికార్డులను పరిశీలించి వాస్తవ పరిస్థితులను నిర్ధారించాలని అధికారులను ఆదేశించారు. సర్వే నంబర్ 90తో పాటు ఇతర పెండింగ్ సర్వేలను కూడా పూర్తి చేయాలని సూచించారు.అశ్వాపురం పరిధిలోని తుమ్మలచెరువు, మామిళ్లగూడెం ప్రాంతాల్లో అటవీ సరిహద్దుకు వెలుపల ఉన్న భూములకు సంబంధించిన లబ్ధిదారుల దరఖాస్తులు, పట్టాదారు పాస్‌పుస్తకాల జారీ ప్రక్రియపై సమీక్షించారు. అర్హులైన గిరిజనులకు హక్కులు కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని, పెండింగ్ దరఖాస్తులను నిబంధనల ప్రకారం త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.ఎండోమెంట్స్ భూముల సరిహద్దుల నిర్ధారణ, ఆక్రమణలకు సంబంధించిన అంశాలపై కూడా సమీక్ష జరిగింది. సంబంధిత భూములను గుర్తించి బౌండరీ ఫిక్సేషన్ పూర్తి చేయడానికి సర్వేయర్లను మోహరించాలని, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. హైదరాబాద్–భద్రాచలం జాతీయ రహదారి NH-930P విస్తరణకు సంబంధించిన అటవీ భూముల మళ్లింపు, ప్రత్యామ్నాయ అటవీకరణ భూముల గుర్తింపు అంశాలను సమీక్షించారు. ప్రతిపాదిత CA భూములకు అవసరమైన రహదారి సౌకర్యం, భూ రికార్డులు, నాన్-ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్లను సిద్ధం చేసి తదుపరి ప్రతిపాదనలు వేగంగా పంపాలని అధికారులను ఆదేశించారు. సీతమ్మ సాగర్, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన అటవీ భూముల మళ్లింపు ప్రతిపాదనల్లో ఉన్న అభ్యంతరాలు, CA భూములకు సంబంధించిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని సూచించారు. పాత ప్రాజెక్టులకు సంబంధించిన కంప్లయన్స్‌ను పూర్తి చేసి అనుమతుల ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వెట్‌ల్యాండ్స్ గుర్తింపు, సంరక్షణపై కూడా కలెక్టర్ సమీక్షించారు. నీటి వనరులకు DGPS సర్వే, హద్దుల నిర్ధారణను వేగవంతం చేసి అర్హత ఉన్న ప్రాంతాల్లో వెట్‌ల్యాండ్ నోటిఫికేషన్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ నిధులను పొందే విధంగా ప్రతిపాదనలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పోలవరం బ్యాక్‌వాటర్స్, పులుసుబొంత ప్రాజెక్టు, సింగరేణి CA భూములకు సంబంధించిన అంశాలపై కూడా సమీక్ష జరిగింది. వివిధ శాఖలకు గతంలో కేటాయించిన CA భూముల వివరాలను సమగ్రంగా సేకరించి క్రాస్ వెరిఫికేషన్ చేయాలని, రైతుల అభ్యంతరాలు ఉన్న ప్రాంతాల్లో రికార్డులను పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. భూ సర్వేలు, అటవీ–రెవెన్యూ సరిహద్దులు, పెండింగ్ భూ వివాదాల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. పనుల్లో అనవసర జాప్యం లేకుండా నిర్దేశిత గడువులోగా సర్వేలు పూర్తి చేసి, సంబంధిత ఉన్నతాధికారులకు సమగ్ర నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ