తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విద్య, వసతులు, భోజన సదుపాయాలపై కస్తూరిబా విద్యాలయంలో తనిఖీ NEET కోచింగ్‌తో విద్యార్థులకు మెరుగైన శిక్షణ విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి సారించాలి పాల్వంచ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, పాఠశాలను జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అందుతున్న విద్యా బోధన, NEET కోచింగ్, విద్యార్థుల హాజరు, పరీక్షల నిర్వహణ, మౌలిక వసతులు, భోజన సదుపాయాలను పరిశీలించి, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు, మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులకు సూచించారు. తనిఖీలో భాగంగా జిల్లా కలెక్టర్ ముందుగా ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయుల హాజరు నమోదును పరిశీలించారు. పాఠశాలలో బోధనా కార్యక్రమాలు సక్రమంగా కొనసాగుతున్నాయా, ఉపాధ్యాయుల హాజరు ఎలా ఉంది, విద్యార్థుల హాజరు శాతం ఎంత అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, గైర్హాజరయ్యే విద్యార్థుల వివరాలను నమోదు చేసి, అవసరమైన సందర్భాల్లో వారి తల్లిదండ్రులకు సమాచారం అందించాలని సూచించారు. అనంతరం ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు నిర్వహిస్తున్న పరీక్షలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులు ఏ సబ్జెక్టుకు పరీక్ష రాస్తున్నారో అడిగి తెలుసుకోగా, కెమిస్ట్రీ పరీక్ష నిర్వహిస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు. పరీక్షల అనంతరం విద్యార్థులకు నిర్వహిస్తున్న అధ్యయన కార్యక్రమాల గురించి కూడా కలెక్టర్ ఆరా తీశారు. NEET కోచింగ్‌లో భాగంగా విద్యార్థులకు సాయంత్రం 3.45 గంటల నుంచి 6.00 గంటల వరకు అదనపు బోధనా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ఈ తరగతుల్లో కెమిస్ట్రీ, ఫిజిక్స్, బోటనీ, జువాలజీ తదితర సబ్జెక్టుల్లో బోధన అందిస్తున్నట్లు వివరించారు. NEET ప్రవేశ పరీక్షకు విద్యార్థులు సమర్థవంతంగా సన్నద్ధమయ్యేలా అదనపు తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. భోజనం నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వంట ప్రక్రియ నుంచి భోజనం వడ్డించే వరకు పరిశుభ్రతను పాటించాలని సూచించారు. ప్రతిరోజూ మెనూ ప్రకారం భోజనం అందేలా సంబంధిత సిబ్బంది పర్యవేక్షించాలని ఆదేశించారు. గత సంవత్సరం నాబార్డ్ నిధుల ద్వారా మంజూరైన నిధులతో నూతనంగా నిర్మించిన అదనపు కిచెన్ షెడ్డును కూడా జిల్లా కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ పనుల వివరాలు, ప్రస్తుతం షెడ్డును ఏ విధంగా వినియోగిస్తున్నారనే విషయాలను సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా నిర్మించిన మౌలిక వసతులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి విద్యా బోధనతో పాటు నాణ్యమైన వసతులు, పౌష్టికాహారం, పరిశుభ్రమైన వాతావరణం, అదనపు శిక్షణ అందించడం ఎంతో ముఖ్యమని జిల్లా కలెక్టర్ అంకిత్ పేర్కొన్నారు. విద్యార్థుల హాజరును మెరుగుపరచడంతో పాటు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేలా నిరంతరం మార్గనిర్దేశం చేయాలని, ప్రతి విద్యార్థి విద్యా ప్రగతిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు, ఉపాధ్యాయులకు సూచించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు,సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ