తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కార్మిక హక్కులపై రాజీ లేదు.. సింగరేణి ఆస్తులపై ప్రైవేటు కన్ను పడనివ్వం! కొత్త బ్లాకులు సంస్థకే.. లాభాల్లో కార్మికులకు వాటా కోసం పోరాటం.శేషగిరిభవన్ లో కొత్తగూడెం,కార్పొరేట్ ఏరియాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్.సింగరేణిలో కార్మికుల పెండింగ్ సమస్యల పై లేబర్ కమిషనర్ వద్ద జరిగిన అగ్రిమెంట్ ను ఫేక్ అంటున్న వారు లేబర్ లీడర్లు ఎలా అవుతారని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ ప్రశ్నించారు.మంగళవారం శేషగిరిభవన్ లో కొత్తగూడెం,కార్పొరేట్ ఏరియాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.సింగరేణిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పటి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ విధానాల వల్ల లాభాల్లో ఉన్న సంస్థకు చెందిన కోట్లాది రూపాయల సొమ్మును విచ్చలవిడిగా ప్రభుత్వ పథకాలకు వాడుకుని నిర్వీర్యం చేసి, కార్మికులకు, సంస్థకు తీరని నష్టం చేశారని ఆరోపించారు తెలంగాణ సెంటిమెంట్ పేరుతో గెలిచిన టీబీజీకేఎస్ యూనియన్ 2012 నుంచి 2023 వరకు పదకొండు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కార్మికులకు ఏం హక్కులు సాధించిందని ప్రశ్నించారు.సింగరేణి బొగ్గును, కరెంటును వాడుకుని 26 వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా సంస్థను అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు.సంస్థకు రావాల్సిన 56వేల కోట్ల బకాయిలు వసూలు కాకపోవడం వల్ల కొత్త యంత్రాలు తేవాలన్నా, పనిముట్లు కొనాలన్నా, సేఫ్టీ మెటీరియల్ తెప్పించాలన్న డబ్బుతో ముడిపడి ఉందని, అవి లేకుంటే కార్మికులు బొగ్గు ఉత్పత్తి ఎలా చేస్తారని ప్రశ్నించారు.కొత్త గనులు వస్తేనే సంస్థ మనుగడ పది కాలాల పాటు కొనసాగుతుందని, కనుక యాజమాన్యం గుర్తించిన శ్రావణపల్లి, సత్తుపల్లి, కోయగూడెం ఓసీల కొత్త బ్లాక్ లను టెండర్ ప్రక్రియ ద్వారా సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేశారు.సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ అనేక పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించి,సమ్మె నోటీసు ఇచ్చి, ఒక్కరోజు సమ్మె కూడా చేయకుండా 24 డిమాండ్లను లేబర్ కమిషనర్ వద్ద ఒప్పందం చేసుకుంటే హర్షించాల్సింది పోయి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.టీబీజీకేఎస్ పదకొండు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అగ్రిమెంట్ పత్రాలను, ఈ రెండేళ్లలో ఏఐటీయూసీ చేసిన అగ్రిమెంట్ పత్రాలను తీసుకుని సింగరేణిలో ఎక్కడైనా చర్చకు సిద్ధమని అన్నారు.చట్టబద్ధంగా చేసిన అగ్రిమెంట్ ను ఫేక్ అని దుష్ప్రచారం చేస్తున్నారని, కార్మికులు ఎవరూ వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దని కోరారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ ల వల్ల 12వ వేజ్ బోర్డు ప్రక్రియ ప్రారంభం ఆలస్యమవుతోందని కేంద్ర ప్రభుత్వం అధికారులతో కమిటీ వేసి వేజ్ బోర్డు పరిష్కారం చేస్తామంటే జాతీయ కార్మిక సంఘాలు వ్యతిరేకించాయని ఆయన తెలిపారు.కేంద్ర ప్రభుత్వం వెంటనే లేబర్ కోడ్ లతో సంబంధం లేకుండా గత విధానాలతోనే వేజ్ బోర్డు ప్రక్రియ ప్రారంభించాలని, అలాగే దీపావళి బోనస్ ను పెంచాలని డిమాండ్ చేశారు. దసరా పండుగ ముందే లాభాల్లో వాటా 40 శాతం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ గెలిస్తే రెండేళ్లు, ఇతర సంఘాలు గెలిస్తే నాలుగేళ్లు ఉండాలా అని ప్రశ్నించారు.ఏఐటీయూసీ చేసిన ఒప్పందంపై సర్క్యులర్లను యాజమాన్యం తక్షణమే జారీ చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో బ్రాంచ్ కార్యదర్శులు ఎస్.వి.రమణమూర్తి,జక్కుల గట్టయ్య,ఉపాధ్యక్షులు క్రిస్టోఫర్,కత్తెర్ల రాములు,సహాయ కార్యదర్శి రాము, ఆఫీస్ బ్యారర్స్ సందబోయిన శ్రీనివాస్,హుమాయూన్,నాగయ్యా,నితిన్,పిట్ కార్యదర్శిలు మధుకృష్ణ,కమల్,అనంతలక్ష్మి,నరేష్,రమేష్,మల్లికార్జున్,సత్తుపల్లి మైనింగ్ స్టాప్ కార్యదర్శి ఎల్ సుశీల్ కుమార్,నాయకులు బండారి మల్లయ్య, మండలరాజేశ్వరరావు, సురేందర్,మురళి, సోమయ్య,శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ