తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆర్‌ఎల్‌సీ సమక్షంలో ఏఐటీయూసీతో కుదిరిన ఒప్పందాలను వెంటనే అమలు చెయ్యాలి.గత ఆర్థిక సంవత్సరం వాస్తవ లాభాలను ప్రకటించి.. కార్మికులకు 40 శాతం వాటా ఇవ్వాలి.ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య డిమాండ్.ఆర్‌ఎల్‌సీ సమక్షంలో ఏఐటీయూసీతో సింగరేణి యాజమాన్యం కుదుర్చుకున్న 24 అగ్రిమెంట్లను వెంటనే అమలు చేయాలని ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య డిమాండ్ చేశారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో సింగరేణికి వచ్చిన వాస్తవ లాభాలను పారదర్శకంగా ప్రకటించి, అందులో కార్మికులకు 40 శాతం వాటాను ప్రకటించాలని కోరారు.ఈ మేరకు మిరియాల రంగయ్య గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.సింగరేణి కార్మికుల సమస్యలను యాజమాన్యం తక్షణమే పరిష్కరించడంతో పాటు ఉత్పత్తి, రక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.మైనింగ్ స్టాఫ్ ప్రమోషన్ పాలసీ సమస్యను వెంటనే పరిష్కరించాలని రంగయ్య డిమాండ్ చేశారు.ఉద్యోగుల అర్హతలు,సీనియారిటీకి అనుగుణంగా ప్రమోషన్లు కల్పించే విధంగా స్పష్టమైన విధానం రూపొందించాలని కోరారు.సింగరేణిలోని మైన్స్, ఓపెన్‌కాస్ట్‌లను గ్యాసిఫికేషన్‌కు అనుకూలంగా అభివృద్ధి చేసే అంశాన్ని యాజమాన్యం పరిశీలించాలని సూచించారు.కొత్తగూడెం ఏరియాలోని పెనగడప వద్ద ఉన్న రామాపురం మైన్‌పై గతంలోనే సర్వే జరిగిందని, సుమారు 300 అడుగుల లోతులో ఉన్న ఈ గని గ్యాసిఫికేషన్‌కు అనుకూలంగా ఉండే అవకాశాలున్నాయని తెలిపారు. దీనిపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి ముందుకు వెళ్లాలని కోరారు.సింగరేణిలోని వివిధ గనులు, విభాగాల్లో మెటీరియల్ షార్టేజ్ సమస్య నెలకొని ఉందని, దీంతో కార్మికుల్లో ఆందోళన వ్యక్తమవుతోందని రంగయ్య తెలిపారు.అవసరమైన మెటీరియల్‌ను సకాలంలో సరఫరా చేసి బొగ్గు ఉత్పత్తితో పాటు కార్మికుల రక్షణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.కార్మికుల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రతి ఏరియాలో నెలకు ఒకసారి ‘డయల్ టు జీఎం’ కార్యక్రమాన్ని నిర్వహించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కార్మికులు నేరుగా జనరల్ మేనేజర్ దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లే అవకాశం కల్పించి, వాటికి పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.అదేవిధంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న కార్మికుల కోసం ప్రతి నెల రెండు సార్లు మెడికల్ బోర్డును నిర్వహించాలని రంగయ్య కోరారు.గతంలో అనారోగ్య సమస్యల ఆధారంగా జరిగిన ఇన్వాలిడేషన్ విధానాన్ని కొనసాగిస్తూ అర్హులైన కార్మికులకు న్యాయం చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.నూతనంగా వచ్చిన బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ చేయకుండా సింగరేణి కార్మికులతోనే బొగ్గును వెలికితీయాలని డిమాండ్ చేశారు.సింగరేణి సంస్థ పరిధిని విస్తరించడంతో పాటు కార్మికులకు ఉపాధి అవకాశాలు పెంచే విధంగా కొత్త బొగ్గు బ్లాకులను వినియోగించుకోవాలని కోరారు.గతంలో ట్రేడ్ యూనియన్లకు గుర్తింపు హోదా ఐదేళ్లు, ఆరేళ్ల పాటు అవకాశం కల్పించిన విధంగానే ఏఐటీయూసీకి కూడా తగిన అవకాశం కల్పించాలని కోరారు.స్ట్రక్చర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి కార్మికుల సమస్యలను చర్చించి పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.కార్మికుల సమస్యల పరిష్కారంలో యాజమాన్యం జాప్యం చేయకుండా, ఏఐటీయూసీతో కుదిరిన అగ్రిమెంట్లను అమలు చేయడంతో పాటు కార్మికుల హక్కులు, రక్షణ, సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని మిరియాల రంగయ్య కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ