తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం కార్పొరేట్: ಸಿంగరేణి కార్మికుల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ నాయకులు బుధవారం కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా అధికారులకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య మాట్లాడుతూ.. గత ఏడాది ఆగస్టు 28న యాజమాన్యంతో కుదిరిన ఒప్పంద హామీలను అమలు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని మండిపడ్డారు. నిలిపివేసిన మెడికల్ బోర్డులను పునరుద్ధరించాలని, మారుపేర్ల సమస్యను పరిష్కరించి అర్హులైన డిపెండెంట్లకు వెంటనే ఉద్యోగ నియామక ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అలాగే కార్మికులకు సొంత ఇంటి పథకాన్ని వర్తింపజేయడంతో పాటు, గనుల్లో రక్షణ పరికరాలు, యంత్రాల విడిభాగాలను తక్షణమే సరఫరా చేయాలన్నారు. జెన్కో, ట్రాన్స్కోల నుంచి సింగరేణికి రావాల్సిన రూ.59 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం చొరవ తీసుకుని ఇప్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే భవిష్యత్తులో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వంగ వెంకట్, ఎస్.వి. రమణమూర్తి, జక్కుల గట్టయ్య తదితర కార్మిక నాయకులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ