తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అటవీ, రెవెన్యూ భూముల సరిహద్దులను సమన్వయంతో నిర్ధారించాలి.వరి ధాన్యం నిల్వకు అనువైన గోదాములను గుర్తించి సమగ్ర నివేదిక సమర్పించాలి. జిల్లాలో చేపట్టిన భూ సర్వే పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. బుధవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత మండలాల అధికారులతో భూ సర్వే పురోగతి, గ్రామాల సరిహద్దుల నిర్ధారణ, అటవీ, రెవెన్యూ భూముల హద్దుల ఖరారు, పెండింగ్ పనులపై సమీక్ష నిర్వహించారు. సర్వే ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కరించి, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.సమీక్షలో భాగంగా వివిధ మండలాల్లో చేపట్టిన సర్వే పనుల పురోగతిని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. మణుగూరు మండలం అనంతారంలో 1,154 ఎకరాలకు గాను 260 ఎకరాల పట్టా భూమి సర్వే పూర్తయిందని, కొత్తగూడెం మండలం రామవారంలో 207 ఎకరాల సర్వే పూర్తయిందని తెలిపారు. చండ్రుగొండ మండలం సీతాయిగూడెంలో గ్రామ సరిహద్దుల నిర్ధారణతో పాటు సుమారు 770 ఎకరాల అటవీ భూమి సర్వే పూర్తయిందని వివరించారు. ఆళ్లపల్లి మండలం పెద్దవెంకటాపురంలో 587 ఎకరాల 15 గుంటల సర్వే, చుంచుపల్లి మండలంలో 389 ఎకరాల 21 గుంటల ప్రభుత్వ భూమి సర్వే పూర్తయినట్లు తెలిపారు.ఇతర మండలాల్లోనూ సర్వే పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు వివరించారు. సుజాతానగర్, చర్ల మండలాల్లో గ్రామ సరిహద్దులు, అబాది సంబంధిత పనులు పూర్తయ్యాయని, పినపాక మండలం బొమ్మరాజుపల్లిలో 368 ఎకరాలకు గాను 220 ఎకరాల సర్వే పూర్తయిందని తెలిపారు. బూర్గంపాడు మండలంలో పినపాక ప్రాంతంలో సుమారు 400 ఎకరాలు, కరకట్ట ప్రాంతంలో 250 ఎకరాల సర్వే పూర్తయిందని, అశ్వాపురం మండలం కుమ్మరిగూడెంలో 152 ఎకరాల సర్వే పూర్తయినట్లు వివరించారు. దుమ్ముగూడెం మండలంలో మొత్తం ఎనిమిది గ్రామాలకు గాను ఐదు గ్రామాల్లో సర్వే పనులు పూర్తయ్యాయని తెలిపారు. ముల్కలపల్లి, అశ్వారావుపేట, దమ్మపేట తదితర మండలాల్లో పెండింగ్ పనుల పురోగతిని సమీక్షించారు.అటవీ, రెవెన్యూ భూముల సరిహద్దు వివాదాలు, రాష్ట్ర సరిహద్దు సమస్యలు, CARS నెట్‌వర్క్ సిగ్నల్ అంతరాయాలు, లైసెన్స్డ్ సర్వేయర్ల కొరత వంటి అంశాల వల్ల కొన్ని ప్రాంతాల్లో సర్వే పనులకు ఆటంకాలు ఎదురవుతున్నట్లు అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యలను సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కరించాలని, లైసెన్స్డ్ సర్వేయర్లకు వేతనాలను సకాలంలో చెల్లించి వారి సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పెండింగ్ పనులపై ప్రత్యేక దృష్టి సారించి సర్వే ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన గోదాముల గుర్తింపుపై కూడా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. మొత్తం 23 మండలాల్లో ధాన్యం నిల్వకు అనువైన గోదాములను క్షేత్రస్థాయిలో పరిశీలించి గుర్తించాలని ఆదేశించారు. గోదాముల లభ్యత, నిల్వ సామర్థ్యం, వినియోగానికి అనుకూలత తదితర వివరాలతో సమగ్ర నివేదిక సమర్పించాలని సూచించారు.భూ సర్వే పనుల్లో జాప్యం జరగకుండా, సంబంధిత శాఖల మధ్య సమన్వయంతో సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వ భూములు, పట్టా భూముల సరిహద్దులను పక్కాగా నిర్ధారించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ