తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పుష్కర ఏర్పాట్లు పూర్తి చేయాలి గోదావరి పుష్కరాల నోడల్ అధికారిగా భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట్ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పించాలి ట్రాఫిక్ నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని జిల్లాలోని పుష్కర ఘాట్ల వద్ద చేపట్టిన పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరం లో జిల్లా ఎస్పీ రోహిత్ రాజుతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఇప్పటికే మంజూరైన పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులచే ప్రారంభమైన పనులతో పాటు మిగిలిన పనులను కూడా నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పోలీస్ శాఖ, సీపీఓ కార్యాలయం నుంచి పుష్కరాల కోసం ప్రత్యేక అధికారులను నియమించాలని ఎస్పీ రోహిత్ రాజు, సీపీఓ సునీతలను ఆదేశించారు. గోదావరి పుష్కరాల పనుల పర్యవేక్షణకు భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట్‌ను నోడల్ అధికారిగా నియమిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పుష్కరాలకు మరో పది నెలల సమయం మాత్రమే ఉన్నందున పనుల పురోగతిని నోడల్ అధికారికి ఎప్పటికప్పుడు తెలియజేయాలని, వారానికొకసారి పనులను సమీక్షించి పురోగతి నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. భద్రాచలం పుష్కర క్షేత్రానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తెలిపారు . ఎండోమెంట్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, వైద్య ఆరోగ్య, పోలీస్ తదితర శాఖలు తమ పరిధిలోని పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని సూచించారు. దుమ్ముగూడెం, పర్ణశాల, మోతేపట్టి నగర్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న పుష్కర ఘాట్లకు సంబంధించి టైర్-1, టైర్-2, టైర్-3 కింద చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించారు.
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ పుష్కరాల నిర్వహణలో అన్ని శాఖలు తమ బాధ్యతలను స్పష్టంగా గుర్తించి పరస్పర సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. పుష్కరాల సమయంలో ట్రాఫిక్, భక్తుల రద్దీని ముందస్తు ప్రణాళికతో సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. పార్కింగ్ ప్రాంతాలు, హోల్డింగ్ ఏరియాలు, ట్రాఫిక్ మళ్లింపు మార్గాలను సంబంధిత శాఖలు పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఖరారు చేయాలని సూచించారు. ప్రధాన రహదారులపై చేపట్టే మరమ్మతులు, రోడ్ల విస్తరణ, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను ముందుగానే స్థానిక పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఎస్పీ సూచించారు. పాల్వంచ–దమ్మపేట, తల్లాడ–భద్రాచలం, బయ్యారం, దుమ్ముగూడెం తదితర ప్రధాన మార్గాల్లో రహదారుల పరిస్థితిని ముందుగానే పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట్, డీఆర్‌ఓ పద్మావతి, డీపీఓ అనూష, డీటీఓ భూషిత్ రెడ్డి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి క్రాంతి కుమార్, కొత్తగూడెం ఆర్డీఓ మధు, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఈఈ సయ్యద్ అహ్మద్ జానీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ