తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : VB-G RAM G పథకం కింద ప్రతి గ్రామ పంచాయతీలో పనులు ప్రారంభించాలి : డి ఆర్ డి ఓ విద్యా చందన. పని కోరే ప్రతి ఒక్కరికీ జూన్ 2027 వరకు పనులు గుర్తించాలి. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత.. ప్రతి పొలానికి పంట కుంట.. ప్రతి ఊరికి ఊట కుంట.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వికసిత్ భారత్ – గ్రామీణ ఉపాధి మరియు జీవనోపాధి మిషన్ (VB-G RAM G) పథకం కింద ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి ఆవాస ప్రాంతంలో పనులు ప్రారంభించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యా చందన ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామాల్లో పని కోరే ప్రతి ఒక్కరికీ జూన్ 2027 వరకు సరిపడా పనులను ముందుగానే గుర్తించాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారులను ఆదేశించారు.ప్రతి 40 మంది పని కోరే వారికి ఒక మేట్‌ను నియమించి, ప్రతి గ్రామంలో 40 నుంచి 60 మంది వరకు కూలీలు పనులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పథకం కింద సంవత్సరానికి 125 రోజుల వరకు ఉపాధి కల్పించే అవకాశం ఉందని, కొలతల ఆధారంగా పని చేసిన వారికి రోజుకు రూ.308 కూలి చెల్లింపు జరుగుతుందని తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణ, భూసార పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పొలానికి పంట కుంట, ప్రతి ఊరికి ఊట కుంట నిర్మించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. పొలం బాటలు, కందకాలు, కాలువల మరమ్మతులు, చెరువుల్లో పూడికతీత పనులను కూడా చేపట్టాలని పేర్కొన్నారు.వ్యక్తిగత లబ్ధిదారులకు నాడెప్ కంపోస్ట్ పిట్లు, పశువులు, మేకలు, గొర్రెల షెడ్లు, కోళ్ల షెడ్లు తదితర నిర్మాణ పనులను చేపట్టే అవకాశం ఉందని తెలిపారు. స్వయం సహాయక సంఘాల కోసం నిర్మించే వి ఓ భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ భవనాలకు నిధులు మంజూరైనందున వాటి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయ పనులు తక్కువగా ఉన్నందున పని కోరే ప్రతి ఒక్కరూ ఉపాధి పనులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనతో పాటు శాశ్వత ఆస్తుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ VB-G RAM G పథకం పనులను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యా చందన తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ