తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పెండింగ్ దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి రికార్డుల ఆధారంగా పారదర్శకంగా పరిశీలన చేపట్టాలి కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయం ను మంగళవారం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా జీవో నెంబర్ 76 కింద వచ్చిన దరఖాస్తుల పరిశీలన, స్క్రూటినీ, రికమండేషన్, డిమాండ్ నోటీసుల జారీ, చెల్లింపులపై కొత్తగూడెం ఆర్డీవో మధు, తహసీల్దార్ పుల్లయ్యతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు చేపట్టిన ప్రక్రియ, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జీవో 76 కింద జిల్లాలో మొత్తం 4,031 దరఖాస్తులు ఉండగా, 2,267 దరఖాస్తులకు స్క్రూటినీ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన దరఖాస్తులపై విచారణ, సంబంధిత రెవెన్యూ రికార్డుల పరిశీలన పూర్తి చేసి తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి దరఖాస్తు ఏ దశలో ఉందో స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు. ఇప్పటికే రికమండ్ చేసిన దరఖాస్తులను కూడా సంబంధిత రికార్డుల ఆధారంగా మరోసారి పరిశీలించి అర్హతలను ధ్రువీకరించాలని కలెక్టర్ తెలిపారు. గతంలో చేపట్టిన ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ప్రక్రియకు సంబంధించిన రికార్డులను పరిశీలించి, అధికారులు చేసిన విచారణ, సిఫారసులకు సంబంధించిన ఆధారాలను నిర్ధారించాలని ఆదేశించారు. ఇప్పటివరకు సుమారు 276 దరఖాస్తులకు డిమాండ్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వివరించారు. డిమాండ్ నోటీసులు జారీ చేసిన దరఖాస్తులు, చెల్లింపులు చేసిన లబ్ధిదారులు, సేల్ ఆర్డర్లు పూర్తయినవి, పట్టాలు జారీ అయిన కేసులను వేర్వేరుగా గుర్తించి పూర్తి వివరాలతో నివేదిక సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కొత్తగూడెం, ఇల్లందు ప్రాంతాలకు సంబంధించిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. దరఖాస్తు ఎవరి వద్ద పెండింగ్‌లో ఉంది, విచారణ పూర్తయిందా, రికమండ్ చేశారా, డిమాండ్ నోటీసు జారీ చేశారా, చెల్లింపు జరిగిందా అనే వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు. పాత, కొత్త దరఖాస్తులను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పరిశీలించాలని ఆదేశించారు. ఇప్పటికే పరిశీలన పూర్తయిన దరఖాస్తులను తదుపరి దశకు పంపడంతో పాటు, మిగిలిన దరఖాస్తులపై విచారణను వేగవంతం చేసి పెండెన్సీని తగ్గించాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. ప్రతి దరఖాస్తుకు సంబంధించిన రికార్డులను క్రమబద్ధీకరించి, భవిష్యత్తులో ఎటువంటి సందేహాలకు తావులేకుండా చర్యలను స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు. అర్హులైన దరఖాస్తుదారులకు ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రక్రియను సకాలంలో పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ