తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గ్రామీణాభివృద్ధి పనులకు సింగరేణి సీఎస్ఆర్ నిధులు రూ.2.44 కోట్లు అందజేత. వైద్య, విద్యా రంగాల అభివృద్ధి, జల సంరక్షణకు ప్రాధాన్యత: జిల్లా కలెక్టర్ అంకిత్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక నియోజకవర్గ పరిధిలో గ్రామీణాభివృద్ధితో పాటు వైద్య, విద్యా రంగాల అభివృద్ధి, జల సంరక్షణకు సంబంధించిన పనుల నిర్వహణ కోసం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులను కేటాయించింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చేపట్టనున్న అభివృద్ధి పనుల కోసం మొత్తం రూ.4,93,80,000 కేటాయించగా, అందులో 50 శాతం అడ్వాన్స్‌గా రూ.2,44,30,000 విలువైన చెక్కును బుధవారం జిల్లా కలెక్టర్ అంకిత్‌కు సింగరేణి మణుగూరు ఏరియా అధికారులు కలెక్టర్ ఛాంబర్‌లో అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సింగరేణి సంస్థ అందిస్తున్న సీఎస్ఆర్ నిధులు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు వైద్య, విద్యా రంగాల అభివృద్ధి, జల సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ పనులు చేపట్టాలని పేర్కొన్నారు. సామాజిక బాధ్యతలో భాగంగా జిల్లాలోని గ్రామాల అభివృద్ధికి సింగరేణి సంస్థ సహకారం అందించడం అభినందనీయమని తెలిపారు. కేటాయించిన నిధులను నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం సద్వినియోగం చేస్తూ, అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని సూచించారు.అనంతరం సింగరేణి అధికారులు అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్‌ను ఆయన ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిసి, గ్రామీణాభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలపై చర్చించారు.ఈ కార్యక్రమంలో సింగరేణి మణుగూరు ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రాంచందర్, ఏజీఎం (పర్సనల్) ఎస్. రమేష్, సివిల్ విభాగానికి చెందిన జి. శివప్రసాద్, సి పి ఓ సునీత తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ