తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విధి నిర్వహణలో ఎస్ఐ మృతి బాధాకరం.బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలి.రోడ్డు ప్రమాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతికరం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. విధి నిర్వహణలో భాగంగా రోడ్డు ప్రమాదానికి గురై రామవరం (కొత్తగూడెం టూటౌన్) ఎస్ఐ కునుసోతు వెంకన్న మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన వినాయక నిమజ్జన బందోబస్తు విధులకు హాజరై, కర్తవ్య నిర్వహణలో ఉండగా గుర్తుతెలియని వాహనం ఢీకొన్న దుర్ఘటనలో ఎస్ఐ వెంకన్న మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రజా రక్షణ కోసం బాధ్యతాయుతంగా సేవలందిస్తూ అకాల మరణం చెందడం పోలీసు శాఖతో పాటు సమాజానికి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ, శోకతప్త హృదయులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అధికారి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, తగిన ఆర్థిక సహాయంతో పాటు ఆ కుటుంబానికి కొండంత అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రమాదానికి కారణమైన వారిపై సమగ్ర దర్యాప్తు జరిపి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఎమ్మెల్యే కూనంనేని ఆకాంక్షించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ