తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భూసేకరణ, టెండర్ల ప్రక్రియలో జాప్యం లేకుండా క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించాలి గోదావరి పుష్కరాల సందర్భంగా చేపట్టిన టైర్-2, టైర్-3 అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, అభివృద్ధి పనుల పురోగతిపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఐడీఓసీలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు. భూసేకరణ, టెండర్ల ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా అవసరమైన చర్యలు చేపట్టి పనులను క్షేత్రస్థాయిలో వెంటనే ప్రారంభించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ సూచించారు. పుష్కరాల కోసం చేపట్టిన అభివృద్ధి పనులను అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని, నిర్దేశిత కాలవ్యవధిలో పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ అంకిత్ భద్రాచలంలో గోదావరి పుష్కరాల కోసం చేపట్టిన పుష్కర ఘాట్లు, ఆలయాల అభివృద్ధి పనుల పురోగతిని వివరించారు. రోడ్ల అభివృద్ధి, ఘాట్ల నిర్మాణం, ఆలయాల అభివృద్ధితో పాటు భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చేపడుతున్న చర్యలను వివరించారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి అవసరమైన భూమిని సంబంధిత శాఖలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, టెండర్ల ప్రక్రియ పూర్తయిన పనులను ఆలస్యం లేకుండా ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించుకుంటూ అన్ని శాఖల సమన్వయంతో పుష్కరాల పనులను వేగవంతంగా పూర్తి చేయనున్నట్లు వివరించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ